- 48 ఏండ్లుగా వీణవంక జాతరను
- మేమే నిర్వహిస్తున్నం:పాడి ఉదయ్ నందన్ రెడ్డి
కరీంనగర్, వెలుగు: ‘‘మా తాత పాడి సుధాకర్ రెడ్డి పేరును బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాడుకోవద్దు. అవసరముంటే ఆయన తాత రఘుపతి రెడ్డి పేరు చెప్పుకొని రాజకీయాల్లో ముందుకు పోవాలి”అని యాప్ టీవీ సీఈవో పాడి ఉదయ్ నందన్ రెడ్డి సూచించారు. పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన వల్ల తమ పేరు కరాబవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి తాత సుధాకర్ రెడ్డి అంటూ కేసీఆర్ గతంలో మాట్లాడారని, ఆ విషయం ఆయనకు ఎవరు చెప్పారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆయనపై పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు గురువారం వీణవంక జాతరలో సమ్మక్క గద్దె మీదకు రావడం, పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించిన నేపథ్యంలో ఉదయ్ నందన్ రెడ్డి ఈ విషయంపై శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మా తాత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మా భూమిలో 1976 నుంచి వీణవంకలో సమ్మక్క జాతర మొదలైంది. వాస్తవానికి మొదటి సమ్మక్క జాతర కౌశిక్ రెడ్డి తాత రఘపతి రెడ్డి మామిడి తోటలో జరిగింది. భూమి పోతదని వారు అడ్డుకుంటే జాతర మా భూమిలో నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి మా దగ్గరే జాతర జరుగుతోంది. 48 ఏండ్లుగా ప్రశాంతంగా జరుగుతున్న ఈ జాతర.. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక సమస్య మొదలైంది.
హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం జాతరను మా కుటుంబం నిర్వహిస్తే ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షించాల్సి ఉంది. కానీ సమ్మక్క దేవత రాకముందే గద్దె మీదికి ఎక్కి.. కొబ్బరి కాయలు పట్టుకుని మేమే జాతర చేస్తామంటూ హైకోర్టు ఆర్డర్‌ను ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధిక్కరించడం సరికాదు. కోర్టు ఆర్డర్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకే పోలీసులు అలా చేశారు”అని ఆయన వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తాము ‘తెలంగాణ ధూంధాం’వీణవంకలో పెడితే, మానుకోటలో రాళ్లు వేసిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని ఉదయ్ నందన్ రెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి వాళ్లు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాశనమవుతుందని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన తన నియోజకవర్గ ప్రజల సమస్యలను అసెంబ్లీలో మాట్లాడాలని, అభివృద్ధికి నిధులు తీసుకురావాలని ఆయన సూచించారు.
