ఈరోజుల్లో పెళ్లి చేసుకోవటం కంటే చాలా మంది లివ్-ఇన్ రిలేషన్ సో కంఫర్టబుల్, బెటర్ అంటూ కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంతా బాగున్నన్ని రోజులూ కలిసుండే జంటలు వద్దనుకున్నప్పుడు విడిపోవటానికి ఈ విధానం వెసులుబాటును కల్పిస్తోంది. అయితే తాజాగా దీనిని కూడా చట్టం కిందకు తీసుకురావాలని గుజరాత్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గుజరాత్ ప్రభుత్వం తాజాగా ఆమోదించిన 'యూనిఫాం సివిల్ కోడ్- 2026' బిల్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఉత్తరాఖండ్ బాటలోనే నడుస్తూ.. జస్టిస్ రంజనా దేశాయ్ కమిటీ సిఫార్సుల మేరకు రూపొందించిన ఈ చట్టం.. పెళ్లిళ్లు, విడాకులు, ఆస్తి వారసత్వం, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లలో పెను మార్పులు తీసుకురాబోతోంది. ముఖ్యంగా లింగ సమానత్వం, సామాజిక సంస్కరణలే లక్ష్యంగా ఈ ముసాయిదాను సిద్ధం చేయబడింది.
కొత్త చట్ట ప్రకారం ఇకపై లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలనుకునే జంటలు తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రార్ వద్ద నమోదు చేసుకోవాలి. ఒకవేళ విడిపోవాలని నిర్ణయించుకున్నా.. ఆ విషయాన్ని అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. లివ్-ఇన్ భాగస్వామి మోసం చేస్తే సదరు మహిళ మెయింటెనెన్స్ పొందే హక్కును కలిగి ఉంటుంది. అంతేకాదు.. ఈ బంధం ద్వారా పుట్టిన పిల్లలకు చట్టబద్ధమైన వారసత్వ హోదా కూడా లభిస్తుంది.
పెళ్లిళ్ల విషయంలోనూ కీలక రూల్స్ తీసుకొచ్చింది గుజరాత్. వయస్సు పరిమితిని పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లుగా ఖరారు చేస్తూనే.. బహుభార్యాత్వాన్ని పూర్తిగా నిషేధించారు. ఈ నిబంధన అతిక్రమిస్తే 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. పెళ్లిళ్లు, విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ.. ఉల్లంఘించిన వారికి రూ.10వేల వరకు జరిమానా విధించనున్నారు. బలవంతపు వివాహాలకు కూడా కఠిన శిక్షలు అమలు చేయనున్నారు.
విడాకుల తర్వాత తిరిగి పెళ్లి చేసుకునే విషయంలో కూడా ఒక విప్లవాత్మక మార్పును చేర్చారు. విడాకులు తీసుకున్న దంపతులు మళ్లీ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటే.. మధ్యలో మూడో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నిబంధన ఇకపై చెల్లదు. ఎటువంటి షరతులు లేకుండా వారు తిరిగి వివాహం చేసుకోవచ్చు. దీన్ని ఉల్లంఘించే వారికి 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
ఆస్తి వారసత్వంలోనూ స్పష్టమైన విభజన చేశారు. వీలునామా రాయకుండా ఎవరైనా మరణిస్తే, ఆస్తి పంపకం కోసం వారసులను మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వరుసలో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు. రెండో వరుసలో సవతి తల్లిదండ్రులు, తాతమ్మలు ఉంటారు. అయితే ఈ చట్టం నుంచి షెడ్యూల్డ్ తెగల వారికి మినహాయింపు ఇచ్చారు. మొత్తానికి 'ఒకే రాష్ట్రం-ఒకే చట్టం' దిశగా గుజరాత్ వేసిన ఈ అడుగు సామాజిక వ్యవస్థలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి ప్రస్తుతం.
