- ప్రభుత్వానికి అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేసే దమ్ము లేదు: కేటీఆర్
- అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకొస్తరు?
- మమ్మల్నే తట్టుకోలేకపోతున్నరు.. కేసీఆర్‌ను తట్టుకుంటరా?
- అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి..లేదంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవ్
- మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పేందుకు వాళ్లెవరు?..సీఎస్ కన్నా ఎమ్మెల్యే స్థాయి పెద్దదని కామెంట్
- బీఆర్‌ఎస్ఎల్పీలో మీడియాతో చిట్‌చాట్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో అందరికీ డ్రగ్స్ టెస్ట్ చేయాలని తాము అడిగామని, కానీ, ప్రభుత్వానికి ఆ దమ్ము లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తమ పార్టీ బీఫాం మీద గెలిచిన వ్యక్తులకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. స్వయంగా సీఎం.. బడ్వే అని కేసీఆర్‌ను తిడితే కూడా స్పీకర్ ఖండించలేదని, అలాంటప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వస్తారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం తమ దెబ్బకే తట్టుకోవడంలేదని, కేసీఆర్‌ను తట్టుకుంటుందా? అని అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ఎల్పీలో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. మూసీ ప్రక్షాళనను ఆరునూరైనా పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారని, అలా చెప్పడానికి వాళ్లెవరని ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ స్థాయి కన్నా ఎమ్మెల్యే పదవి పెద్దదని చెప్పారు. అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని, లేదంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవని హెచ్చరించారు. ఓవర్ యాక్షన్ చేస్తున్న అధికారులు కొందరు గొట్టం పనులు చేస్తున్నారన్నారు. కుక్కలు తోకను ఆడించడంకాదు.. తోకే కుక్కను ఆడించినట్టుగా అధికారుల వ్యవహారం ఉందని పేర్కొన్నారు.
ఇది సర్కార్ కాదు.. సర్కస్ అని కేటీఆర్ విమర్శించారు. మూసీ సుందరీకరణ కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) రుణం వచ్చిందంటూ శ్రీధర్‌బాబు పచ్చి అబద్ధాలు చెప్తున్నారన్నారు. డీపీఆర్ ఇవ్వలేదు కాబట్టి రుణం ఇవ్వలేదని ఏడీబీ క్లారిటీ ఇచ్చిందని చెప్పారు. సభను తప్పుదోవపట్టించినందుకు మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని అన్నారు. ‘‘పైసా ఇచ్చినోడు లేడు. డీపీఆర్ లేదు. మేం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకం కాదు, లూటీకి మాత్రమే వ్యతిరేకం.
బఫర్‌జోన్ 50 మీటర్లని చెప్పి.. 5 కిలోమీటర్ల దూరం ఉన్న హనుమాన్‌నగర్ కాలనీలోని 600 ఇండ్లకూ నోటీసులిచ్చారు. బాధితులొచ్చి మాకు గోడు చెప్పుకుంటున్నారు. 3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి, 10 వేల ఇండ్లకు టార్గెట్ పెట్టారు’’ అని విమర్శించారు. అసలు మెయిన్‌హార్ట్ కంపెనీని భారత్ నిషేధించిందని, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియానే దానిని బ్యాన్ చేసిందని గుర్తు చేశారు. ఆరు గ్యారంటీలకు డబ్బులు లేవుగానీ.. మూసీకి లక్షన్నర కోట్లు ఎలా తెస్తారని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ కోసమేనని ఆరోపించారు.
ఫార్మా సిటీలో రియల్ ఎస్టేట్పెట్టుబడులు
ఫార్మా సిటీ కోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసిందని, కానీ, అక్కడ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ‘‘ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తామంటున్నారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల చుట్టూ ఇస్తే వాళ్లుపోయి అక్కడ ఉండాలా?’’ అని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం లో పచ్చి బూతులున్నాయని, కనీసం అది కూడా కరెక్ట్ ఇవ్వరా? అని ప్రశ్నించారు.
మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని భట్టి విక్రమార్క చెప్తున్నారని, ఇచ్చినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్అన్నారు. ‘‘మరో మంత్రి సీతక్క మాత్రం నన్ను రాజీనామా చేయాలని అంటున్నారు. అసలు అబద్ధాలు చెప్తున్న వారు కదా రాజీనామా చేయాల్సింది.. మరి సీతక్క రాజీనామా చేస్తారా? లేదంటే భట్టి రాజీనామా చేస్తారా? చెప్పాలి”అని ప్రశ్నించారు. ఒక్క మూసీలోనే కాదని, ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వం పేదల ఇండ్లు కూలుస్తున్నదన్నారు. వెలుగుమట్ల, ఇతర ప్రాంతాల్లో ఇవి జరిగాయన్నారు. మధుపార్క్ కోసం ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం.. మిగతా వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
