- రూ.70 లక్షల విలువైన సరుకు స్వాధీనం
నారాయణ్ ఖేడ్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో ఆలయానికి చెందిన పూల తోటలో గంజాయి సాగు చేస్తూ.. అమ్ముతున్న పూజారిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పట్టుకుంది. రూ. 70 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నారాయణఖేడ్ మండలం పంచగామలో గంజాయి సాగు జరుగుతుందనే సమాచారం మేరకు శుక్రవారం డీటీఎఫ్ సీఐ దుబ్బాక శంకర్, ఎస్ఐలు హన్మంత్, అనుదీప్, అంజిరెడ్డి, అరుణ జోతి, శివకృష్ణ, రాజేశ్ సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు.
ఆలయ ఆవరణలోని బంతిపూల తోటలో గంజాయి సాగు చేస్తుండగా అవాక్కయ్యారు. పూజారి నర్సయ్యను అదుపులోకి తీసుకుని విచారించగా.. చాలాకాలంగా గంజాయి సాగు చేస్తు ప్యాకెట్లుగా అమ్ముతున్నట్టు చెప్పాడు. 685 గంజాయి మొక్కలు,17.741 కేజీల గంజాయి, 0.897 గ్రాముల విత్తనాలు, రూ.30 వేల నగదు, వేయింగ్ మెషీన్ సీజ్ చేశారు.
గుడి పూజారి నర్సయ్య మహారాజ్ భార్య కొన్నాళ్ల కింద చనిపోయింది. ఇద్దరు కూతుళ్లకు పెండ్లి చేశాడు. అనంతరం ఓ ఆశ్రమంలో కొన్నాళ్లు ఉండి పంచగామ గుడి పూజారిగా వచ్చారు. ఆలయ ఆవరణలో పూల తోటలో గంజాయి సాగు చేస్తూ.. అమ్ముతున్నాడు.
కేసు నమోదు చేసి పూజారి నర్సయ్య మహారాజ్ ను నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీటీఎఫ్ సిబ్బందిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్ ఖాసీం, మెదక్ డిప్యూటీ కమిషనర్ జె.హరికిషన్, అసిస్టెంట్ కమిషన్ శ్రీనివాసరెడ్డి, ఈఎస్ నవీన్ చంద్రా, ఏఈఎస్ మణెమ్మను అభినందించారు.
