- లివర్ దెబ్బ తినడంతో పెరిగిన అమ్మోనియా లెవెల్స్
- కంట్రోల్లోకి రాని బీపీ.. కొనసాగుతున్న డయాలసిస్
- ఇన్ఫెక్షన్స్ సోకకుండా హై డోస్ యాంటీబయాటిక్స్
- హెల్త్ బులిటిన్ విడుదల చేసిన నిమ్స్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య హెల్త్ కండీషన్ సీరియస్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నెల 25న నిమ్స్ లో చేరిన ఆమె.. ఇప్పటికీ అన్ కాన్షియస్ లోనే ఉన్నారని, లైఫ్ సపోర్ట్ పై చికిత్స అందిస్తున్నామని శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు. ఆమె లివర్ పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదని, దీంతో శరీరంలో అమ్మోనియా స్థాయిలు ప్రమాదకరంగా పెరిగిపోయాయని తెలిపారు. ఈ ప్రభావంతో మెదడులో వాపు వచ్చిందని, ఆమె కండీషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందని వెల్లడించారు. బ్రెయిన్లో వాపు తగ్గించేందుకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
బీపీ డౌన్.. మందులతోనే..
సౌమ్య బీపీ నిలకడగా లేకపోవడంతో మందుల ద్వారానే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లోకి తెస్తున్నామని డాక్టర్లు తెలిపారు. బాడీలో పెరిగిన అమ్మోనియాను తగ్గించేందుకు, కిడ్నీల పనితీరుకు సపోర్టుగా డయాలసిస్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమెకు ప్లేట్‌లెట్లు ఎక్కించడంతో పాటు, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఉండేందుకు హైడోస్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నామని, గుండె పనితీరు సాధారణంగానే ఉన్నప్పటికీ.. పరిస్థితి క్రిటికల్ గానే ఉందని డాక్టర్లు తెలిపారు.
ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరో సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ వంటి పలు డిపార్ట్మెంట్ల సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణలో 24 గంటల పాటు ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు నిమ్స్ ప్రొఫెసర్లు డాక్టర్ సునీల్ కుమార్, డాక్టర్ పద్మజా దుర్గా తెలిపారు.
