కుష్టు మందులతో నయమయ్యేదే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

కుష్టు మందులతో నయమయ్యేదే : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
  • మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు

ఖమ్మం టౌన్, వెలుగు : కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బాపూజీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుష్టు వ్యాధి మందులతో పూర్తిగా నయమయ్యే జబ్బు అని తెలిపారు.

సబర్మతి ఆశ్రమంలో గాంధీజీ స్వయంగా కుష్టు రోగులకు సేవలు అందించి వారి పట్ల వివక్షను తొలగించేందుకు కృషి చేశారని గుర్తు చేశారు. జిల్లాలో ప్రస్తుతం 74 మంది కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి ఉచిత చికిత్స అందిస్తున్నామని, 12 నెలల పాటు మందులు వాడితే ఈ వ్యాధి పూర్తిగా తగ్గుతుందని వివరించారు. 

కుష్టు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని, అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు ‘స్పర్శ’ కుష్టు వ్యాధి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయిలో సర్పంచుల అధ్యక్షతన గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వ్యాధిగ్రస్తులపై ఉన్న సామాజిక వివక్షను తొలగించి, వారికి గౌరవప్రదమైన జీవనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం కుష్టు వ్యాధి నిర్మూలనపై అధికారులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్, అదనపు వైద్యాధికారి చందు నాయక్, ఇతర ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాచలం :  వాసవీక్లబ్, భద్రాచలం పట్టణ ఆర్యవైశ్య మహాసభ  ఆధ్వర్యంలో భద్రాచలంలో పట్టణంలో శుక్రవారం మహాత్మగాంధీ 78వ వర్ధంతి జరిగింది. పాతమార్కెట్​లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వచ్ఛభారత్​ కార్యక్రమంలో భాగంగా ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కార్యక్రమంలో చారుగుళ్ల శ్రీనివాసరావు, రేపాక ధనుంజయ, ఉడతా నగేశ్​, శీమకుర్తి రాజా మనోహర్, యశోద రాంబాబు తదితరులు పాల్గొన్నారు.