ఖమ్మం టౌన్, వెలుగు: రూ.196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ అధ్యక్షతన నిర్వహించిన బడ్జెట్, సాధారణ కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.196 కోట్లతో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించామని, ఈ నిధులతో నగరవాసులకు మెరుగైన సేవలు అందాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ప్రస్తావిస్తూ ఏప్రిల్ మొదటి వారం నాటికి జిల్లా పరిధిలో 10 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి అవుతాయని తెలిపారు. అనంతరం మేయర్ నీరజ మాట్లాడుతూ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. అభివృద్ధి పనులు తర్వరగా పూర్తయ్యేలా కార్పొరేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ అంచనాలను సభకు నగరపాలక సంస్థ పరిపాలన అధికారి సీహెచ్. శ్రీనివాస్ వివరించారు.
భూ వివాదాలు పరిష్కారానికి చర్యలు..
అటవీ, రెవెన్యూ సరిహద్దు భూ వివాదాలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కలెక్టరేట్ లో అడిషనల్కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల డీఎఫ్ వోలతో కలిసి అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. కనకగిరి ఘాట్ అటవీ ప్రాంతం సంబంధించి కొంత భాగం భూమి రికార్డ్, సరిహద్దులు సరిగ్గా నమోదు కాలేదని తెలిపారు.
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో సమాంతరంగా సర్వే నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అటవీ, రెవెన్యూ శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ సిబ్బందితో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా, ఎస్సీ యాక్షన్ ప్లాన్ పై అడిషనల్ కలెక్టర్ సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించి, పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు.
