- మారథాన్ సెమీస్‌లోజ్వెరెవ్‌పై కార్లోస్ గెలుపు
- సినర్‌కు నొవాక్ చెక్
మెల్‌బోర్న్: కెరీర్ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాజ్... 25వ మేజర్ టైటిల్ వేటలో ఉన్న సెర్బియా టెన్నిస్ యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో ఒకరినొకరు ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఐదు సెట్ల థ్రిల్లింగ్ సెమీఫైనల్స్‌లో అత్యద్భుత ఆటను చూపెట్టిన ఈ ఇద్దరూ మెగా టోర్నీ టైటిల్ ఫైట్‌కు చేరుకున్నారు. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో అడుగు పెట్టిన 22 ఏండ్ల అల్కరాజ్.. ఓపెన్ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరిన యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. మరోవైపు నొవాక్ 38 ఏండ్ల వయసులో 11వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ తుదిపోరుకు అర్హత సాధించాడు. ఓవరాల్‌గా 38వ సారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరుకొని ఔరా అనిపించాడు.
శుక్రవారం ఐదున్నర గంటల మారథాన్ పోరులో గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఆడిన అల్కరాజ్.. జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై చారిత్రక విజయం సాధించగా... డబుల్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ విజయ యాత్రకు నొవాక్ చెక్ పెట్టాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన సెమీఫైనల్‌గా రికార్డుకెక్కిన తొలి పోరులో టాప్ సీడ్ అల్కరాజ్ 6–-4, 7–-6 (7/5), 6–-7 (3/7), 6–-7 (4/7), 7–-5 తేడాతో మూడో సీడ్ జ్వెరెవ్‌ను ఓడించాడు. ఆదివారం నొవాక్‌పై గెలిస్తే అతి పిన్న వయసులో అన్ని మేజర్ టైటిల్స్ నెగ్గి కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసిన ప్లేయర్‌గా తన దేశానికే చెందిన లెజెండ్ రఫెల్ నడాల్ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఇక, దాదాపు నాలుగు గంటలకు పైగా సాగిన మరో హై-వోల్టేజ్ సెమీస్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 3-–6, 6–-3, 4-–6, 6–-4, 6–-4తో రెండో సీడ్ సినర్ (ఇటలీ)పై విజయం సాధించాడు. గత రెండేండ్లుగా తన 25వ గ్రాండ్‌స్లామ్ కలకు అడ్డు తగులుతూ ఆస్ట్రేలియా గడ్డపై ఎదురులేకుండా దూసుకుపోతున్న యానిక్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు.
అల్కరాజ్ అదరహో
జ్వెరెవ్‌తో 5 గంటల 27 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే అల్కరాజ్ తనదైన శైలిలో దూకుడు చూపెట్టాడు. గత ఏడాది యూఎస్ ఓపెన్ గెలిచినప్పటి ఫామ్‌ను కొనసాగిస్తూ తొలి రెండు సెట్లను కైవసం చేసుకున్నాడు. అయితే, మూడో సెట్ చివర్లో అసలు డ్రామా మొదలైంది. అల్కరాజ్ కుడి కాలి తొడ కండరాల నొప్పితో తీవ్ర ఇబ్బందిపడ్డాడు. వెంటనే మెడికల్ టైమౌట్ తీసుకున్నప్పటికీ స్పెయిన్ కుర్రాడు పూర్తి స్థాయిలో కోలుకోలేకపోయాడు. ఈ అవకాశాన్ని జ్వెరెవ్ సద్వినియోగం చేసుకున్నాడు.వరుస పాయింట్లు సాధించి మూడు, నాలుగు సెట్లను టై-బ్రేకర్లలో గెలుచుకున్నాడు. దీంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్‌కు దారితీసింది. ఈ సెట్ ఆరంభంలో అల్కరాజ్ సర్వీస్ కోల్పోవడంతో జ్వెరెవ్ స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లాడు. ఒక దశలో జర్మనీ ప్లేయర్ 5-–4తో ఆధిక్యంలో నిలిచి మ్యాచ్ కోసం సర్వీస్ చేశాడు. ఓటమి ఖాయం అనుకున్న సమయంలో కార్లోస్ తనలోని నిజమైన చాంపియన్‌ను నిద్రలేపాడు. నొప్పితో బాధపడుతున్నా కోర్టులో పాదరసంలా కదులుతూ అద్భుతమైన విన్నర్స్ కొట్టాడు. ముఖ్యంగా ఆరో గేమ్‌లో ఒక డ్రాప్ షాట్‌ను ఛేజ్ చేస్తూ అతను కొట్టిన ఫోర్‌హ్యాండ్ విన్నర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. చివరికి పదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను అదే జోరుతో మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు.
అనుభవమే గెలిచింది..
రెండో సెమీస్‌లో ఏకంగా 26 ఏస్‌లతో హడలెత్తించిన సినర్ తన పదునైన పవర్‌ఫుల్ సర్వీసులతో జొకోవిచ్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాడు. 6–-3తో తొలి సెట్ గెలిచి తాను హ్యాట్రిక్ టైటిల్ దిశగా వెళ్తున్నట్లు సంకేతాలిచ్చాడు. కానీ, రెండో సెట్‌లో తన అనుభవాన్ని చూపెట్టిన నొవాక్ బేస్‌లైన్ వద్ద అద్భుతమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి సెట్ కైవసం చేసుకున్నాడు. తర్వాతి సెట్‌లో సినర్ మళ్ళీ పుంజుకోగా, నాలుగో సెట్‌లో నొవాక్ తనదైన శైలిలో విన్నర్లు కొట్టి మ్యాచ్‌ను 2–2తో సమం చేశాడు. చివరి సెట్‌లో సినర్ కుర్రాడిలా వేగంగా ఆడితే, జొకోవిచ్ తన అనుభవంతో పక్కా ప్రణాళికతో ఆడాడు. 4–-4 వద్ద సినర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెర్బియా స్టార్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకుని విజయాన్ని అందుకున్నాడు. 72 విన్నర్లు కొట్టిన సినర్ 2 డబుల్ ఫాల్ట్స్, 42 అనవసర తప్పిదాలు చేసి రెండే బ్రేక్ పాయింట్లు రాబట్టాడు. ఇక 12 ఏస్‌లు, 46 విన్నర్లు కొట్టి 3 డబుల్ ఫాల్ట్స్, 72 తప్పిదాలు చేసిన నొవాక్ మూడు బ్రేక్ పాయింట్లతో పైచేయి సాధించాడు.
