- ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి
- ఖమ్మంలో వైభవంగా ప్రారంభమైన ఇందిరాగాంధీ 5వ జాతీయ మహిళా టీ–20 క్రికెట్ టోర్నమెంట్
ఖమ్మం టౌన్, వెలుగు : మహిళా క్రికెట్ నేడు దేశ సరిహద్దులను దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరుగుతోందని, ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న క్రీడాకారిణులు భవిష్యత్లో భారత మహిళా క్రికెట్ శిరోమణులుగా ఎదగాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఇందిరాగాంధీ 5వ జాతీయ సీనియర్ మహిళా టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్, విదర్భ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను ప్రారంభించిన ఎంపీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారిణులను పరిచయం చేసుకున్నారు. వారి శిక్షణ విధానాలు, క్రీడలతో పాటు విద్యను ఎలా సమన్వయం చేసుకుంటున్నారని, ఆరా తీశారు. స్వయంగా బ్యాటింగ్ చేసి ప్లేయర్లలో నింపారు. ఈ జాతీయ స్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మహమ్మద్ మతిన్ కృషిని ఎంపీ అభినందించారు. ఖమ్మంకు నిరంతరం మహిళా క్రికెట్ జట్లను తీసుకువస్తూ క్రీడాభివృద్ధికి తోడ్పడుతున్న డైరెక్టర్ సందీప్ ఆర్య సేవలను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల మహిళా క్రికెట్ జట్ల సభ్యులు, క్రీడా నిర్వాహకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు.
సీఎం కప్ క్రీడల విజేతలకు బహుమతులు
రెండు రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడల్లో గెలిచిన విజేతలకు ఎంపీ రఘురాం రెడ్డి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పూనుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, డీవైస్ ఓ సునీల్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ కే.శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్, మండల విద్యాశాఖ అధికారిని శైలజలక్ష్మి, టూ టౌన్ సీఐ బాలకృష్ణ, అథ్లెటిక్స్ కోచ్ గౌస్, కార్పొరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బియ్యనీ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
