- కొత్త స్కీమ్‌పై అవగాహన పెంచాలని రాష్ట్రాలకు సూచన
- పెండింగ్ పనులన్నీ గడువులోగా పూర్తిచేయాలి
- డీఆర్డీఓలకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్ శ్రుతి ఓజా ఆదేశం..
హైదరాబాద్, వెలుగు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్’ (వీబీ-జీరామ్ జీ- గ్రామీణ్) అమలుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ చర్యలు వేగవంతం చేసింది.
దీనికి సంబంధించి శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త చట్టం అమలుకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆ లోగా క్షేత్రస్థాయిలో దీని పనితీరును పరిశీలించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని నాలుగైదు రాష్ట్రాల్లో ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
దీనికోసం రాజస్తాన్, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలు ఇప్పటికే ముందుకొచ్చినట్లు సమాచారం. అయితే, వీబీ-జీ రామ్ స్కీమ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత ప్రచారం కల్పించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. కొత్త స్కీమ్ విధివిధానాలు, టెంప్లేట్లను స్థానిక భాషల్లోకి అనువదించి రాష్ట్రాలకు పంపించనున్నారు. ప్రతి రాష్ట్రం ఈ స్కీమ్ కోసం ప్రత్యేకంగా ఆర్‌బీఐలో ఖాతా తెరవాల్సి ఉంది. లబ్ధిదారుల కేవైసీ అనుసంధానం, ఇతర టెక్నికల్ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలి.
గడువులోగా పనులన్నీ పూర్తిచేయండి: శ్రుతి ఓజా
మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధి హామీ పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా అధికారులతో సమీక్షించారు. శుక్రవారం ఆమె హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల డీఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో ఏ జిల్లాకు నిర్దేశించిన పనిదినాలను ఆ జిల్లా కచ్చితంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీలో చేసిన పనులకు సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులను ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్‌లో నమోదు చేసి క్లెయిమ్ చేయాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ మిషన్ కింద చేపట్టిన పనుల బిల్లులు కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కూలీలకు పనులు కల్పించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, మార్చి నెలాఖరు నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసేలా డీఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని ఆమె దిశానిర్దేశం చేశారు.
