న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టాన్ని మోడీ ప్రభుత్వం క్రమంగా బలహీనపరుస్తోందని కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. గురువారం పార్లమెంట్‌లో సమర్పించిన ఆర్థిక సర్వే 2025-=26లో సమాచార హక్కు చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని సూచించిన విషయాన్ని ఉదహరిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్థిక సర్వేలో ఆర్టీఐ చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని సూచించారు. సమాచారాన్ని నిలిపివేయడానికి "మంత్రిత్వ వీటో"ను సర్వే సూచించిందని, ప్రజా పరిశీలన నుంచి బ్యూరోక్రాట్ల ప్రజా సేవా రికార్డులు, బదిలీలు, సిబ్బంది నివేదికలను రక్షించే అవకాశాన్ని అన్వేషించాలని కోరుకుంటున్నట్లు ఖర్గే పేర్కొన్నారు.
‘‘2019లో మోదీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని దెబ్బతీసింది. సమాచార కమిషనర్ల టెన్యూర్, జీతాలపై నియంత్రణ తీసుకుని, స్వతంత్ర వాచ్‌డాగ్‌లను లొంగదీసుకునేలా చేసింది" అని ఖర్గే ఆరోపించారు. 2025 నాటికి 26వేలకుపైగా ఆర్టీఐ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023: ఆర్టీఐలోని పబ్లిక్ ఇంటరెస్ట్ క్లాజ్‌ను నాశనం చేసి, గోప్యతను ఆయుధంగా మార్చి అవినీతిని కాపాడుకునేలా, స్క్రూటినీని అడ్డుకునేలా చేసిందని ఖర్గే ఆరోపించారు.
గత నెల (డిసెంబర్ 2025) వరకు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ లేకుండా నడిచింది – గత 11 సంవత్సరాల్లో ఏడోసారి ఈ కీలక పదవిని ఉద్దేశపూర్వకంగా ఖాళీగా ఉంచారని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 100 మందికిపైగా ఆర్టీఐ కార్యకర్తలు హత్యకు గురయ్యారని, సత్యాన్ని వెలికితీసేవారిని శిక్షించే, భయపెట్టే వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఖర్గే ఆరోపించారు.
