IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఇస్తే బెటర్.. ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

IPL 2026: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ఇస్తే బెటర్.. ఏబీ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. అయితే 2025 సీజన్‌లో నిరాశాజనక ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో ఇప్పుడు జట్టులో పలు మార్పుల దిశగా ఫ్రాంచైజీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా లోయర్, మిడిల్ ఆర్డర్ తో పాటు వికెట్‌కీపర్ స్థానాలపై కొత్త ఆప్షన్లను పరిశీలిస్తోంది. దీంతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎంఎస్ ధోనీపై ఆర్సీబీ మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ ఇప్పటికీ జట్టులో కొనసాగుతూ నంబర్ 8 లేదా 9లో బ్యాటింగ్ చేస్తూ, కెప్టెన్సీ చేయకపోతే అది జట్టులో ఒక స్థానాన్ని పూర్తి చేసినట్లు కాదన్నారు. ఒక్క ఆటగాడు కాదు, జట్టు సమిష్టి ప్రదర్శనే ట్రోఫీని గెలిపిస్తుంది.. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ ఇప్పుడు నాయకత్వం చేపట్టేందుకు సరైనవారని సూచించారు. 

ఇదే విషయంపై మాజీ భారత క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా కూడా చెప్పాడు. ధోనీ లోయర్ ఆర్డర్ లో కాకుండా మిడిల్ లోకి వచ్చి బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ధోనీ నంబర్ 8 లేదా 9లో బ్యాటింగ్ చేయడం వలన జట్టుకి ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. మ్యాచ్‌ను మలుపుతిప్పే సామర్థ్యం అతడికి ఉందన్నారు. అతను 25 నుంచి -30 బంతులు ఆడితే ఏమి చేయగలడో ఊహించలేమన్నారు. అలాగే, పుజారా సీఎస్కే జట్టు వాతావరణాన్ని కూడా ప్రస్తావిస్తూ, చెన్నై టీమ్ లో ఆటగాళ్లకు కుటుంబంలాంటి వాతావరణం ఉంటుంది.. కానీ ఇప్పుడు జట్టులో మార్పులు జరుగుతున్నాయి.. యంగ్ ప్లేయర్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు. 

ఇదిలా ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ట్రేడ్‌లో సంజూ శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకుని.. రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ 2026లో సంజూ శాంసన్ అద్భుతంగా రాణించి, ఐదు మ్యాచ్‌ల్లో 320కి పైగా పరుగులు చేశాడు. అతడితో పాటు కార్తిక్ శర్మ, ఉర్విల్ పటేల్‌లను జట్టులోకి తీసుకుంది. దీంతో కీపింగ్ విషయంలో టీమ్ కి పలు ఆప్షన్స్ లభించాయి. కాగా ఐపీఎల్2026లో చెన్నై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 30న గువాహటిలోని బర్సపారా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.