ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం.. కాబుల్ మారణహోమంపై భారత్ ఫైర్

ఆసుపత్రిపై పాక్ దాడి అమానుషం.. కాబుల్ మారణహోమంపై భారత్ ఫైర్

ఆఫ్గన్ రాజధాని కాబుల్‌లోని ఒక ఆసుపత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిని భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. ఈ దాడిని పిరికిపంద చర్య అని, అత్యంత అనాగరికమైనదిగా పేర్కొంది. ఆసుపత్రిపై దాడి క్షమించరాని హింసగా అభివర్ణిస్తూ భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఘాటైన ప్రకటన విడుదల చేసింది. సోమవారం రాత్రి కాబుల్‌లోని ఓమిడ్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది మరణించగా.. దాదాపు 250 మందికి పైగా గాయపడ్డారు. 2021లో అమెరికా బలగాల ఉపసంహరణ సమయంలో జరిగిన బాంబు దాడి తర్వాత, ఆఫ్గానిస్థాన్‌లో ఇదే అత్యంత దారుణమైన ఘటనగా నమోదైంది.

రోగులు చికిత్స పొందే ఆసుపత్రిని ఏ రకంగానూ సైనిక లక్ష్యంగా పరిగణించలేమని, ఇది ముమ్మాటికీ సామాన్య పౌరులపై పాక్ జరిపిన మారణహోమమేనని భారత్ అభిప్రాయపడింది. ఒక మారణకాండను సైనిక చర్యగా చిత్రీకరించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని విదేశీ వ్యవహారాల శాఖ విమర్శించింది. ఆఫ్గానిస్థాన్ సార్వభౌమాధికారంపై ఇది ప్రత్యక్ష దాడి అని, ప్రాంతీయ శాంతి స్థిరత్వానికి పాక్ చర్యలు తీవ్ర ముప్పుగా మారినట్లు భారత్ హెచ్చరించింది. తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సరిహద్దులు దాటి పాకిస్థాన్ ఇలాంటి దాడులకు పాల్పడుతోందని భారత్ ఆరోపించింది.

పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి దారుణానికి పాల్పడటం అత్యంత అసహ్యకరమైన విషయమని భారత్ పేర్కొంది. ఏ మతం, ఏ చట్టం లేదా ఏ నైతికత కూడా ఒక ఆసుపత్రిని, అందులోని రోగులను లక్ష్యంగా చేసుకోవడాన్ని సమర్థించలేవని విదేశీ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో ఘాటుగా స్పష్టం చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని అంతర్జాతీయ సమాజం కఠినంగా శిక్షించాలని, ఆఫ్గానిస్థాన్ పౌరుల రక్షణకు భరోసా కల్పించాలని భారత ప్రభుత్వం డిమాండ్ చేసింది.

ఈ క్లిష్ట సమయంలో భారత్ ఆఫ్గాన్ ప్రజలకు అండగా ఉంటుందని, ఆ దేశ సార్వభౌమాధికారం.. ప్రాదేశిక సమగ్రతకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని భారత్ పునరుద్ఘాటించింది. దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. పాకిస్థాన్ మాత్రం తాము పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకోలేదని వాదిస్తున్నప్పటికీ, ప్రాణనష్టం జరిగిన తీరును బట్టి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది దాయాది దేశంపై.