ఇంటర్ ప్రాక్టికల్స్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ జె. శ్రీనివాస్

 ఇంటర్ ప్రాక్టికల్స్ కు ఏర్పాట్లు పూర్తి చేయాలి : కలెక్టర్ జె. శ్రీనివాస్

నల్గొండ అర్బన్, వెలుగు: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌ కు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్‌‌లో జిల్లా ఇంటర్మీడియట్, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2 నుంచి 11 వరకు  ఉంటాయన్నారు.  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి  సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని 143 జూనియర్ కాలేజీల నుంచి మొత్తం 9,251 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు.  ఇందులో జనరల్ విభాగంలో 6,092 మంది, ఒకేషనల్ 3,159 మంది హాజరుకానున్నట్లు తెలిపారు.  

రెండవ సంవత్సరం విద్యార్థుల్లో ఎంపీసీలో 3,850 మంది, బైపీసీలో 2,016 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం 86  పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇందులో57 జనరల్ జూనియర్ కాలేజీలు, 29 ఒకేషనల్ జూనియర్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా గుర్తించినట్లు వెల్లడించారు.  విద్యార్థులు పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సహకారంతో ప్రత్యేక బస్సు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  పరీక్షలకు సంబంధించిన పత్రాలు, రికార్డులు సకాలంలో చేరవేయడానికి స్పీడ్ పోస్టు సేవలను వినియోగించాలని చెప్పారు.  జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి దస్రు,  ప్రిన్సిపల్స్ రాకేందు కుమార్ , ధనరాజ్ ,పద్మ , శ్రీదేవి పాల్గొన్నారు.