చౌటుప్పల్, వెలుగు : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, దోపిడీ అంతం కావాలని, పేదలకు న్యాయం జరగాలంటే రాజకీయాల్లో సమూల మార్పులు రావాలని, అలాంటి బాధ్యత తనలాంటివారిపై ఉందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అనంతరం, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేశ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కృతజ్ఞానంభినందన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, కొన్ని సమీకరణాల వల్ల అది ఆలస్యమవుతోందని తెలిపారు. పదవుల కోసం తాను ఎవరినీ బతిమిలాడబోనని, నిజాయితీగా కష్టపడే తత్వం ఉన్నవారికి గుర్తింపు తప్పక లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే రోజుల్లో చౌటుప్పల్ నియోజకవర్గంగా మారుతుందని, రీజినల్ రింగ్ రోడ్, రైలు మార్గాలతో ఈ ప్రాంతం అత్యంత కీలకంగా మారుతుందని తెలిపారు. త్యాగాలైనా, పోరాటాలైనా కేవలం ప్రజల కోసమేనని స్పష్టం చేస్తూ, భవిష్యత్లో బడుగు బలహీన వర్గాల వ్యక్తులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసే స్థాయికి ఎదగడమే తన లక్ష్యమని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
