పట్టుపురుగుల పెంపకంతో అధిక లాభాలు :కలెక్టర్ బి. చంద్రశేఖర్

పట్టుపురుగుల పెంపకంతో అధిక లాభాలు :కలెక్టర్ బి. చంద్రశేఖర్

చిట్యాల, వెలుగు: పంట మార్పిడిలో భాగంగా రైతులు పట్టుపురుగుల పెంపకంపై దృష్టి సారిస్తే తక్కువ రిస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో అధిక లాభాలు పొందవచ్చని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కనగల్ మండలం నరసింహపురంలో రైతు పుండరీకం సాగు చేస్తున్న పట్టుపురుగుల పెంపకం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సాగు పద్ధతులు, ప్రభుత్వ సబ్సిడీల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ వరి లాంటి సంప్రదాయ పంటలకు బదులుగా ఆయిల్ పామ్, ఉద్యాన తోటలు, పట్టుపురుగుల పెంపకం లాంటి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. సెరికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కేంద్ర ప్రభుత్వం 50శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25శాతం సబ్సిడీ అందిస్తున్నాయని, జిల్లాలోని భూమి, వాతావరణం దీనికి అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

ఏప్రిల్ 2న నిర్వహించే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ గ్రామసభల్లో రైతులకు ఈ సాగుపై పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతి, వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు ప్రక్రియపై సర్పంచులు, కార్యదర్శులతో చర్చించి పలు సూచనలు చేశారు.