నల్గొండ కార్పొరేషన్ పీఠం బీజేపీదే : కే. లక్ష్మణ్

నల్గొండ కార్పొరేషన్ పీఠం బీజేపీదే : కే. లక్ష్మణ్
  • బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కే. లక్ష్మణ్ 

నల్గొండ అర్బన్, వెలుగు: నల్గొండ,  కార్పొరేషన్ పీఠం ఈసారి బీజేపీదేనని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ అవినీతి, కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ఇప్పుడు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. 

యువత, మహిళలు, రైతులు, బడుగు బలహీన వర్గాలు మోసపోయామనే భావనలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దొందూదొందేనని, ఈ రెండు పార్టీలు తోడుదొంగలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, రాష్ట్రాన్ని దోచుకుని ఢిల్లీకి కప్పం కడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. నల్లగొండ కార్పొరేషన్‌లోని 48 డివిజన్లకు తమ అభ్యర్థులను ఖరారు చేశామని వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ కౌన్సిలర్లు బీజేపీలో చేరి పార్టీ కండువా కప్పుకున్నారు.

బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి మున్సిపాలిటీ వరకు ర్యాలీ నిర్వహించి, పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు  డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, పల్లెబోయిన శ్యాంసుందర్, చింత ముత్యాల్ రావు, పాలకూరి రవిగౌడ్ పాల్గొన్నారు.