బడ్జెట్ 2026 ఎఫెక్ట్: నిర్మలమ్మ నిర్ణయంతో వెండి రేట్లకు తిరిగి రెక్కలు వస్తాయా..? జరగబోయేది ఇదే..

బడ్జెట్ 2026 ఎఫెక్ట్: నిర్మలమ్మ నిర్ణయంతో వెండి రేట్లకు తిరిగి రెక్కలు వస్తాయా..? జరగబోయేది ఇదే..

దేశ ప్రజలు ఫిబ్రవరి 1, 2026న కేంద్ర బడ్జెట్ ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వర్గాల దృష్టి ప్రధానంగా వెండి రేట్లపై నెలకొంది. సిల్వర్ కేవలం ఆభరణాల తయారీకే కాకుండా.. ఆధునిక పరిశ్రమలలో కీలకమైన ముడిసరుకుగా మారటమే రేట్ల ర్యాలీకి కారణంగా మారింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించబోయే పన్ను విధానాలు సిల్వర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. ముఖ్యంగా జనవరి 31 నాటి ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో భారత కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి కిలో ధర రూ.2లక్షల 91వేల 922 వద్ద ట్రేడవుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

ALSO READ : ఫిబ్రవరి 1న బడ్జెట్ ధమాకా: ఆదివారం కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయ్..

వెండి ధరలను ప్రభావితం చేసే ప్రధాన అంశం దిగుమతి సుంకం అని మనందరికీ తెలిసిందే. భారత్ తన అవసరాలకు కావాల్సిన వెండిలో 80 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వెండిపై 7.5 శాతం కస్టమ్స్ డ్యూటీ, 3 శాతం జీఎస్టీ అమల్లో ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని తగ్గించాలని ఆభరణాల రంగానికి చెందిన నిపుణులు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సుంకాన్ని తగ్గిస్తే.. దేశీయంగా వెండి ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో ఆభరణాల అమ్మకాలు, పెట్టుబడులు పెరిగే అవకాశం మరింత పెరగనుంది. దీనికి విరుద్ధంగా సుంకాలు పెంచితే.. వెండి రేట్లు తిరిగి ఆకాశాన్ని తాకి సామాన్యులకు భారం అవుతాయి.

ALSO READ : ట్రంప్ సంచలన నిర్ణయం: 1987 సీన్ రిపీట్.. గోల్డ్ సిల్వర్ రేట్లు ఇంకా తగ్గనున్నాయా..?

మరోవైపు.. పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం విపరీతంగా పెరుగుతోంది. సోలార్ పవర్ ప్యానెల్స్ తయారీలో వెండి కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి ఇచ్చే ప్రోత్సాహకాలు, సబ్సిడీలు వెండి డిమాండ్‌ను 15 నుండి 20 శాతం వరకు పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌లో కూడా వెండిని ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుత పారిశ్రామిక డిమాండ్‌లో ఎలక్ట్రానిక్స్ రంగమే దాదాపు 68 శాతం సిల్వర్ డిమాండ్ క్రియేట్ చేసింది. 

ALSO READ : వావ్.. ఒక్కరోజే కేజీ రూ.45వేలు తగ్గిన వెండి రేటు.. గ్రాము రూ.16వేలకు దిగొచ్చిన గోల్డ్..

పెట్టుబడి పరంగా కూడా వెండికి ఆదరణ పెరుగుతోంది. 2025లో సిల్వర్ ఈటీఎఫ్స్ లోకి భారీగా డబ్బు కుమ్మరించారు ఇన్వెస్టర్లు. సురక్షితమైన పెట్టుబడిగా భావించే వెండిపై బడ్జెట్ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండబోతోంది. పన్ను సంస్కరణలు, పారిశ్రామిక విధానాలు వెండిని మరింత విలువైనదిగా మారుస్తాయా లేదా అనేది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంతో తేలిపోనుంది. ఇన్వెస్టర్లు, పరిశ్రమలు ఈ టర్నింగ్ పాయింట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.