Silver Rate Alert: వెండి ధర 50% క్రాష్ గ్యారెంటీ అంట.. చెప్పింది జేపీ మోర్గన్ మాజీ నిపుణుడు

Silver Rate Alert: వెండి ధర 50% క్రాష్ గ్యారెంటీ అంట.. చెప్పింది జేపీ మోర్గన్ మాజీ నిపుణుడు

బంగారంతో పోటీపడుతూ దూసుకుపోతున్న వెండి ధరలకు త్వరలోనే బ్రేకులు పడనున్నాయా? ఇప్పటికే తగ్గిన రేట్లకు మించి రానున్న రోజుల్లో సిల్వర్ క్రాష్ ఉండబోతోందా అనే ప్రశ్నకు అవుననే జవాబు వినిపిస్తోంది. రాబోయే ఏడాది కాలంలో వెండి ధర ఏకంగా 50 శాతం మేర పతనమయ్యే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత మార్కెట్ విశ్లేషకులు. జేపీ మోర్గాన్ మాజీ గ్లోబల్ రీసెర్చ్ హెడ్ మార్కో కొలనోవిక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే.. కమోడిటీ మార్కెట్‌లో ఇలాంటి విపరీతమైన పెరుగుదల తర్వాత అంతే వేగంగా పతనం సంభవిస్తుందని, వెండి విషయంలోనూ ఇది రిపీట్ అవటం దాదాపు ఖాయమని ఆయన ఎక్స్ పోస్టులో హెచ్చరించారు.

కమోడిటీ మార్కెట్‌లో ఏర్పడే బబుల్ ఎక్కువ కాలం నిలవదని అంటున్నారు కొలనోవిక్. ఎన్ఎఫ్‌టీల వంటి ఆస్తులతో పోలిస్తే.. వెండి వంటి భౌతిక వస్తువుల ధరలు పెరిగినప్పుడు పరిశ్రమల నుంచి డిమాండ్ తగ్గిపోతుంది. అదే సమయంలో అధిక ధరల వల్ల పాత వెండి రీసైక్లింగ్ పెరగడం, కొత్త గనుల నుంచి ఉత్పత్తి వేగవంతం కావడం వంటి అంశాలు మార్కెట్‌లో సరఫరాను పెంచుతాయని ఆయన చెబుతున్నారు. వెండి ఉత్పత్తిదారులు కూడా భవిష్యత్తులో ధరలు తగ్గుతాయనే భయంతో తమ వద్ద ఉన్న స్టాక్స్ వెంటనే అమ్మేయడానికి ఇష్టపడతారని చెప్పారు. ఈ పరిణామాలన్నీ వెండి ధరను సగానికి పడిపోయేలా చేస్తాయని కుండబద్దలు కొట్టారు.

మరోవైపు.. దిగ్గజ ట్రేడర్ పీటర్ బ్రాండ్ కూడా మార్కెట్‌లోని ప్రస్తుత అసాధారణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో జరుగుతున్న వెండి ట్రేడింగ్ వాల్యూమ్స్ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయన్నారు. కేవలం ఒక్క వారంలోనే 4.3 బిలియన్ ఔన్ల వెండి ట్రేడ్ అయ్యిందని, ఇది ప్రపంచ దేశాల 5 ఏళ్ల వెండి ఉత్పత్తికి సమానమని పేర్కొన్నారు. ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరగడం అంటే అది భారీ డిమాండ్ మాత్రమే కాదు.. అంతే స్థాయిలో సప్లై కూడా వచ్చే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఒక గని యజమానిగా చూస్తే.. ఉత్పత్తి వ్యయం కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ ధర ఉన్నప్పుడు ఎవరైనా తమ నిల్వలను విక్రయించడానికి ఇష్టపడతారని, ఇది వెండి ధరల పతనానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.

►ALSO READ | బడ్జెట్ 2026 ఎఫెక్ట్: నిర్మలమ్మ నిర్ణయంతో వెండి రేట్లకు తిరిగి రెక్కలు వస్తాయా..? జరగబోయేది ఇదే..

మార్కెట్ ఎప్పుడూ అతిని సహించదు అంటూ తన మెంటర్ చెప్పిన మాటలను పీటర్ బ్రాండ్ గుర్తు చేసుకున్నారు. అంటే మార్కెట్‌లో ఏదైనా వస్తువు ధర అసాధారణంగా, అసహజంగా పెరిగితే.. ఆ పరిస్థితి శాశ్వతం కాదని, ఏదో ఒక సమయంలో సహజమైన ధరకు తిరిగి చేరుకుని తీరుతుందని అన్నారు. ప్రస్తుత వెండి ధరల పెరుగుదల కూడా అటువంటి స్థాయికి చేరుకుందని, ఈ భారీ మూవ్ ముగింపు దశకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. వెండి ధరలు నిజంగానే 50 శాతం తగ్గుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి, కానీ ఈ దిగ్గజాల హెచ్చరికలు మాత్రం ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేశాయి. గడచిన మూడు రోజులుగా జరుగుతున్న భారీ సిల్వర్ క్రాష్ చూస్తుంటే వాళ్లవి ఉత్తి మాటలు కావని అర్థం చేసుకోవచ్చు. 

వెండి చరిత్ర ఏం చెబుతోంది..?
వెండి మార్కెట్ చరిత్రను పరిశీలిస్తే ఇలాంటి భారీ 'బూమ్ అండ్ బస్ట్' సైకిల్స్ కొత్తేమీ కాదు. 1975-1980 మధ్య వెండి ధర ఏకంగా 1,188 శాతం పెరిగి 3.8 డాలర్ల నుంచి అమాంతం 50 డాలర్లకు చేరినా.. వడ్డీ రేట్ల పెరుగుదలతో ఒక్కసారిగా 89 శాతం కుప్పకూలింది. అలాగే 2001లో 4 డాలర్ల వద్ద ఉన్న వెండి 2011 నాటికి మళ్లీ 50 డాలర్లను తాకి, ఆ తర్వాత 72 శాతం పతనమైంది. ఆర్థిక అనిశ్చితిలో విపరీతంగా పెరగటం.. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడగానే దారుణంగా పడిపోవడం వెండికి అలవాటైన రికార్డే.