దేశీయ ఈవీ టూవీలర్ రంగంలో ఒకప్పుడు రారాజుగా వెలిగిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీలో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పుల పేరుతో భవిష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా.. తన మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం మందిని లేఆఫ్ చేసింది. దీనివల్ల సుమారు 620 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. ఆటోమేషన్ పెంచుతూ, సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెబుతున్నప్పటికీ, లోపల జరుగుతున్న అసలు పరిణామాలు మాత్రం ఆందోళనకరంగా ఉన్నాయి.
గత 3 నెలలుగా ఓలా ఈవీ స్కూటర్ల మార్కెట్ షేర్ క్రమంగా పడిపోతోంది. జనవరి 31, 2026 నాటికి ఓలా కేవలం 7వేల 221 యూనిట్ల రిజిస్ట్రేషన్లను మాత్రమే నమోదు చేసింది. అదే సమయంలో ప్రత్యర్థి ఏథర్ ఎనర్జీ 20వేల 786 యూనిట్ల అమ్మకాలతో ఓలా కంటే మూడు రెట్లు మెరుగ్గా ముందుకు సాగుతోంది. ఇక మార్కెట్ లీడర్‌గా ఉన్న టీవీఎస్ మోటార్ 33వేల 286 యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బజాజ్ ఆటో 24వేల 211, హీరో మోటోకార్ప్ 12వేల 608 ఈవీలను విక్రయించి ఓలాను వెనక్కి నెట్టి దూసుకుపోతున్నాయి గ్రీన్ మెుబిలిటీ రేసులో.
ఓలా ఎలక్ట్రిక్ వైఫల్యానికి ప్రధాన కారణం భవిష్ అగర్వాల్ తన దృష్టిని అనేక రంగాలపై మళ్లించడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లపై పూర్తి శ్రద్ధ పెట్టకుండా.. చిప్ మేకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి పలు విభాగాల్లోకి ప్రవేశించడం వల్ల కంపెనీ తన లక్ష్యాన్ని కోల్పోయిందని వారు అంటున్నారు. దీనికి తోడు కంపెనీలో ఉద్యోగుల అట్రిషన్ భయానక స్థాయిలో ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 54 శాతం మంది ఉద్యోగులు కంపెనీని వీడి వెళ్లిపోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సీఎఫ్ఓ వంటి కీలక పదవుల్లో ఉన్నవారు కూడా రాజీనామా చేయడం కంపెనీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.
►ALSO READ | Silver Rate Alert: వెండి ధర 50% క్రాష్ గ్యారెంటీ అంట.. చెప్పింది జేపీ మోర్గన్ మాజీ నిపుణుడు
ఇలాంటి పరిణామాలతో ఓలా భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈవీ స్కూటర్లు కొన్న కస్టమర్లు సర్వీస్ సమస్యలు, నాణ్యతా లోపాలతో ఇబ్బంది పడటం కంపెనీ పెరును మసకబార్చింది. ఈ క్రమంలో గట్టి పోటీ కారణంగా కస్టమర్లు ఇతర బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఓలా తన సూపర్ ఆంబిషన్స్ తగ్గించుకుని, కేవలం వాహన తయారీ, కస్టమర్ అనుభవంపై దృష్టి పెడితే తప్ప తిరిగి పుంజుకోవడం కష్టమే. ప్రస్తుతం జరుగుతున్న ఈ లేఆఫ్స్ కంపెనీని లాభాల బాటలోకి తీసుకెళ్తాయా లేదా అనేది వేచి చూడాల్సిన మ్యాటర్.
