పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్లో శనివారం వేర్పాటువాదులు (BLA) ఒక్కసారిగా రెచ్చిపోయారు. పలు జిల్లాల్లో ప్లాన్ ప్రకారం జరిపిన ఈ దాడుల్లో 10 మంది పాకిస్థాన్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఎదురుకాల్పుల్లో 37 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఏం జరిగిందంటే...బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) అనే నిషేధిత సంస్థ ఈ దాడులు జరిపింది. దీనిని ‘ఆపరేషన్ హెరోఫ్’ (Operation Herof) లో రెండో దశగా చెప్పుకుంటున్నారు. ఉగ్రవాదులు ఒకే సమయంలో వేర్వేరు నగరాల్లో ఉన్న సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు చేశారు.
సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ప్రకారం.. ఉగ్రవాదులు జనావాసాల్లోకి చొరబడి వాహనాలకు నిప్పంటించారు. రైఫిళ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. క్వెట్టా, గ్వాదర్, నుష్కి వంటి నగరాల్లో కాల్పులు, పేలుళ్లు జరిపారు.
►ALSO READ | ట్రంప్ హయాంలో రెండోసారి షట్ డౌన్.. నిధుల కొరతతో నిలిచిన ప్రభుత్వ సేవలు
దింతో ప్రాంతీయ రాజధాని అయిన క్వెట్టాలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. బాంబు పేలుళ్లు, కాల్పులు ఆగకపోవడంతో అధికారులు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సరియాబ్ రోడ్డులో ఓ పోలీసు వాహనంపై దాడి చేసి ఇద్దరు అధికారులను చంపడమే కాకుండా, వాహనాన్ని తగలబెట్టారు. సైన్యం, ఇంటెలిజెన్స్ ఆఫీసులపై ఆత్మాహుతి దాడులు చేశామని, కొన్ని చోట్ల సైనిక శిబిరాల్లోకి కూడా చొరబడ్డామని BLA ప్రకటించుకుంది.
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ఘటనలను ధృవీకరించారు. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోందని, ఇప్పటికే 37 మందిని మట్టుబెట్టామని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడేందుకు భద్రతా దళాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
