వాషింగ్టన్: ఎప్‌స్టీన్ ఫైల్స్.. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాల్లోని చాలా మంది అగ్రనేతలు, బడా వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా సెలబ్రెటీలకు ఒక రకమైన భయం. వారు చేసిన అనైతిక, అసాంఘిక కార్యకలాపాలు ఈ ఫైల్స్ ద్వారా బట్టబయలయ్యాయి. ఇంకొందరి చీకటి బాగోతం ఈ పత్రాల్లో నిక్షిప్తమై ఉంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి అగ్ర నేతలు కూడా ఈ జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించిన జెఫ్రీ ఎప్‌స్టీన్ సెక్స్ స్కాండల్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి తాజాగా అమెరికా న్యాయ శాఖ సుమారు మరో 30 లక్షల పత్రాలను బహిర్గతం చేసింది.
ఈ ఫైల్స్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్, ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్, కింగ్ చార్లెస్ III సోదరుడు ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్ వంటి పాపులర్ నేమ్స్ ఈ పత్రాల్లో కనిపించాయి. ఇజ్రాయెల్ ట్రంప్‌తో రాజీ పడిందని, అలాగే కుష్నర్ కుటుంబానికి అవినీతి, రష్యా నుంచి డబ్బు, అల్ట్రా-జియోనిస్ట్ చాబాద్ నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయని ఈ పత్రాల్లో పేర్కొన్నారు. లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ను మౌంట్‌బాటెన్-విండ్సర్ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఆహ్వానించినట్లు పత్రాల ద్వారా బహిర్గతమైంది.
ఈ సందర్భంగా యూఎస్ డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ మాట్లాడుతూ.. శుక్రవారం (జనవరి 30) ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి మూడు మిలియన్లకు పైగా పత్రాలను బహిరంగపరిచామని తెలిపారు. ఈ ఫైల్స్ ను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశామని చెప్పారు. ఎప్స్టీన్ పత్రాలన్నింటినీ పూర్తిగా బహిర్గతం చేయాలనే చట్టం మేరకు ఎప్స్టీన్, అతని మాజీ భాగస్వామి గిస్లైన్ మాక్స్‌వెల్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రభుత్వం బహిర్గతం చేయాలి ఇందులో భాగంగానే అమెరికా ఎప్స్టీన్ ఫైళ్లను దశలవారీగా విడుదల చేస్తోంది. 2025, డిసెంబర్ 19 నాటికి ఫైల్స్ అన్ని విడుదల చేయాలనే ఆదేశాలు ఉన్నప్పటికీ.. బాధితుల వివరాలు బహిర్గతం కాకుండా న్యాయ శాఖ ఫైళ్లను జాగ్రత్తగా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్ స్టీన్ ఫైల్స్ విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
విమానంలో ట్రంప్, స్విమ్మింగ్ ఫూల్లో క్లింటన్ అమ్మాయిలతో పార్టీ:
2025, డిసెంబర్ నెలలో కూడా ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించిన 3 లక్షల పత్రాలను అమెరికా బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఇందులో హాలీవుడ్ నటులు, రాజకీయ ప్రముఖులు, రాజకుటుంబీకుల ఫోటోలు ఉండటం అంతర్జాతీయంగా ప్రకంపనాలు సృష్టించింది. బయటకు విడుదలైన 3,500 ఫైళ్లలో 2.5 GB కంటే ఎక్కువ ఫోటోలు, డాక్యుమెంట్లు ఉన్నాయి.
వీటిలో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అమ్మాయిలతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో పార్టీ చేసుకుంటున్న దృశ్యాలు, పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్, హాలీవుడ్ నటులు క్రిస్ టక్కర్, కెవిన్ స్పేసీ, బ్రిటన్ యువరాజు ఆండ్రూ, బిల్ క్లియర్సన్ వంటి ప్రముఖుల ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోలు ఎక్కడ తీశారనే విషయంపై స్పష్టత లేదు. 1994లో ఒక 13 ఏళ్ల బాలికను ఎప్స్టీన్.. ట్రంప్ రిసార్ట్‌కు తీసుకువెళ్లాడని, అక్కడ ఎప్స్టీన్ జోక్ చేయగా ట్రంప్ నవ్వాడని ఒక బాధితురాలు ఆరోపించినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. అలాగే గతంలో మిస్ టీన్ యూఎస్ఏ పోటీల సమయంలో అమ్మాయిలు బట్టలు మార్చుకుంటున్న రూమ్‌లోకి ట్రంప్ అకస్మాత్తుగా ప్రవేశించేవారని కూడా పత్రాల్లో పేర్కొన్నారు.
