సర్కారుపై రిటైర్మెంట్ల భారం..వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978 మంది పదవీ విరమణ

సర్కారుపై  రిటైర్మెంట్ల భారం..వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978  మంది పదవీ విరమణ
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9,978  మంది పదవీ విరమణ
  •     దాదాపు రూ.6 వేల కోట్లు అవసరమని అంచనా
  •     ఇప్పటికే ఉద్యోగులకు రూ.9 వేల కోట్లకుపైగా బకాయిలు
  •     ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తున్నా సరిపోని పరిస్థితి
  •     ఆ మొత్తాన్ని పెంచాలని కోరుతున్న ఎంప్లాయిస్​
  •     రిటైర్​మెంట్​ ఏజ్ పెంచి బెనిఫిట్స్​ భారం తప్పించుకున్న గత సర్కారు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఆర్థిక సంవత్సరం నిధుల సమీకరణ పరంగా అత్యంత కీలకంగా మారనుంది. అధికారిక గణాంకాల ప్రకారం వచ్చే ఏడాది దాదాపు 9,978 మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేయబోతున్నారు. వీరందరికీ చెల్లించాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వంటి రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కోసం సుమారు రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది నుంచే రిటైర్​మెంట్ల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో, భారీ మొత్తంలో నిధులను సమకూర్చుకోవడంపై అధికారులు దృష్టి సారించారు. ఒకేసారి వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వీరికి తప్పనిసరిగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్తగా వచ్చే రిటైర్​మెంట్ బెనిఫిట్స్ భారాన్ని పక్కన పెడితే, ఇప్పటికే ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు భారీగానే ఉన్నాయి. 


జీపీఎఫ్  పార్ట్ ఫైనల్స్, సరెండర్ లీవులు, మెడికల్ రీయింబర్స్‌‌మెంట్లు వంటివన్నీ కలిపి దాదాపు రూ. 9 వేల కోట్లకు పైగా పెండింగ్‌‌లో ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా నిధుల లభ్యత లేకపోవడంతో పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నది. ఈ పాత బకాయిలను క్లియర్ చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారగా, వచ్చే ఏడాది అదనంగా జమయ్యే రూ.6 వేల కోట్ల భారం ఖజానాపై మరింత ఒత్తిడిని పెంచుతుందని అధికారులు అంటున్నారు.

నెలకు రూ.700 కోట్లు.. ఏమాత్రం సరిపోవు

మొత్తంగా పరిశీలిస్తే 2026–27 ఆర్థిక సంవత్సరంలో నిధుల సర్దుబాటు ఇబ్బందిగా మారే అవకాశముంది. 9,978 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండగా, ఒక్కో ఉద్యోగికి సగటున రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు బెనిఫిట్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పెండింగ్‌‌లో ఉన్న రూ.9 వేల కోట్ల బకాయిలకు తోడు, కొత్తగా వచ్చే రూ.6 వేల కోట్ల అవసరాలను కలుపుకుంటే, మొత్తం రూ. 15 వేల కోట్ల మేర నిధులు సమకూర్చాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి ప్రభు త్వం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పెండింగ్‌‌లో ఉన్న బకాయిలను విడతలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ప్రతి నెలా కొంత మొత్తాన్ని విడుదల చేస్తున్నది. ఉద్యోగుల వివిధ పెండింగ్ బిల్లుల కోసం ఖజానా నుంచి గత మూడు నెలలుగా నెలకు సుమారు రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లు చెల్లిస్తున్నారు. అయితే, పేరుకుపోయిన వేల కోట్ల బకాయిలతో పోల్చితే ఈ మొత్తం సరిపోవడం లేదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదే స్థాయిలోనే చెల్లింపులు కొనసాగితే బకాయిలు మొత్తం తీరడానికి చాలా సమయం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీ విడుదల చేసే మొత్తాన్ని మరిం త పెంచాలని, సీనియారిటీ ప్రాతిపదికన బిల్లులు త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఇప్పటికే తిప్పలు..  

2021లో అప్పటి ప్రభుత్వం ఆర్థిక భారం తప్పించుకునేందుకు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచింది. దీంతో  మూడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్​మెంట్లు జరగకపోవడంతో గత బీఆర్ఎస్​సర్కార్  ఊపిరి పీల్చుకుంది.  ఆ సమయంలో బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో తాత్కాలికంగా ఆర్థిక వెసులుబాటు లభించింది. అయితే, నాడు వాయిదా పడిన రిటైర్​మెంట్లన్నీ ఇప్పుడు  వస్తుండటంతో, ఆ భారం బడ్జెట్‌‌పై పడుతున్నది. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగో నెల (2024 ఏప్రిల్)​ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 35 శాతం మేర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్స్ వంటి​వాటికే పోతున్నది. 2014–15లో జీతభత్యాలు, పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన సొమ్ము రూ.21,233 కోట్లుంటే.. ఈ ఆర్థిక సంవత్సరం అది రూ.60 వేల కోట్లకు చేరింది. గత పదేండ్ల కాలంలో చెల్లింపులు ఏకంగా 179 శాతం మేర పెరిగాయి.  కొత్త వేతన సవరణ ఒప్పందం (పీఆర్సీ)తో పాటు డీఏలు పెండింగ్​లో ఉన్నాయి. వాటిని కూడా అమలు చేస్తే ఈ భారం మరింత పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెడికల్‌‌ బిల్లులు, సరెండర్‌‌ లీవ్స్‌‌లకు కూడా డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ వర్గాలు చెప్తున్నాయి.