ఆఫర్ లెటర్ మాయాజాలం: పేరుకు 18 లక్షల శాలరీ ప్యాకేజీ.. చేతికి వచ్చేది మాత్రం రూ.50 వేలే

ఆఫర్ లెటర్ మాయాజాలం: పేరుకు 18 లక్షల శాలరీ ప్యాకేజీ.. చేతికి వచ్చేది మాత్రం రూ.50 వేలే

ప్రస్తుతం ఇండియాలో జాబ్ అనగానే సీటీసీ ఎన్ని లక్షలు అనే మాటే ముందుగా వినిపిస్తోంది. ఎంత ఎక్కువ ప్యాకేజీ ఉంటే అంత గ్రేటు. మరీ ముఖ్యంగా ఐటీ రంగంతో పాటు స్టార్టప్ కంపెనీల్లో ఆఫర్ లెటర్లు చూస్తుంటే వాళ్లు చెబుతున్న జీతాలు మధ్యతరగతి జీవితకాలం సంపాదనకు మించిపోతున్నాయి. అయితే అసలు ఈ జీతాల లెక్కల మాయ వెనుక ఉన్న అసలు నిజం ఏంటి.. చెప్పినన్ని లక్షలు చేతికి వస్తున్నాయా అనే వాస్తవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.... 

కార్పొరేట్ ప్రపంచంలో ముఖ్యంగా స్టార్టప్ రంగంలో అడుగుపెడుతున్న కొత్త గ్రాడ్యుయేట్లు భారీ శాలరీ ప్యాకేజీ అనే గాలానికి చిక్కుకుపోతున్నారు. ఆఫర్ లెటర్ మీద కనిపించే అంకెకు, ప్రతి నెలా బ్యాంక్ ఖాతాలో జమ అయ్యే సొమ్ముకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటోంది. దీనిని CTC మాయాజాలం అని పిలవచ్చు. ఇటీవల 'బ్లాక్‌సే బ్లాక్' వ్యవస్థాపకుడు సాహిల్ ఠాకూర్ షేర్ చేసిన ఒక రియల్ స్టోరీ ఈ శాలరీ మోసాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తోంది.

ముంబైలోని ఒక స్టార్టప్ కంపెనీ ఒక విద్యార్థికి ఏడాదికి రూ.18 లక్షల భారీ ప్యాకేజీని ఆఫర్ చేసింది. ఆ సంఖ్యను చూసి ఆ విద్యార్థి తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సంబరపడిపోయాడు. కానీ సాహిల్ ఆ ఆఫర్ లెటర్‌ను లోతుగా పరిశీలించినప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ భారీ శాలరీ ప్యాకేజీలో గ్యారెంటీగా వచ్చే ఫిక్స్డ్ జీతం జస్ట్ రూ.6 లక్షలు మాత్రమే. అంటే నెలకు చేతికి వచ్చేది అక్షరాలా రూ.50వేలు మాత్రమే. ఇక మిగిలిన రూ.12 లక్షలు కేవలం కాగితాలకే పరిమితమైన లెక్క.

►ALSO READ | Ola Electric lays: పడిపోతున్న అమ్మకాలు.. ఊడుతున్న ఉద్యోగాలు: ఓలాలో ఏం జరుగుతోంది?

మిగిలిన రూ.12 లక్షల వేతనాన్ని కంపెనీ ఎలా పెంచి డివైడ్ చేసిందో అర్థం చేసుకోవాలి. ఇందులో మొదటిది పెర్ఫార్మెన్స్ బోనస్. ఈ విద్యార్థి విషయంలో అది రూ.4 లక్షలుగా ఉంది. అయితే ఇది రావాలంటే 120 శాతం టార్గెట్లు రీచ్ అవ్వాలి. ఈ టార్గెట్లను మేనేజర్లు ఎంత కఠినంగా రూపొందిస్తారంటే.. కేవలం 10 శాతం మంది ఉద్యోగులు మాత్రమే వీటిని అందుకోగలరు. ఇక రెండోది రిటెన్షన్ బోనస్ రూ.3 లక్షలు. ఇది పొందాలంటే కనీసం రెండేళ్లు అదే కంపెనీలో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత వర్క్ కల్చర్‌లో చాలామంది 18 నెలలకే రాజీనామా చేస్తుంటారు. ఇక మూడోది ESOPs - రూ.5 లక్షలు. కంపెనీ ఐపీఓకి వెళ్లినా లేదా వేరే సంస్థ కొనుగోలు చేసినా మాత్రమే వీటి విలువ బయటపడుతుంది, లేదంటే అవి సున్నా కింద లెక్క. అంటే రూ.18 లక్షల భారీ ప్యాకేజీలో రూ.12 లక్షలు గాల్లో లెక్కలే ఉన్నాయ్.

చాలామంది ఫ్రెషర్లు కేవలం ప్యాకేజీలో చూపే అంకెల గారడీని చూసి ఉద్యోగాలకు ఓకే చెప్పేస్తున్నారు. అందుకే ఉద్యోగంలో చేరడానికి ముందే శాలరీ బ్రేక్-అప్ అడగడం చాలా అవసరం అని గుర్తుంచుకోండి యూత్. గ్యారెంటీగా వచ్చే ఫిక్స్‌డ్ జీతం ఎంత? షరతులతో కూడిన బోనస్ ఎంత? అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. స్నేహితుల ప్యాకేజీలతో పోల్చుకుని బాధపడటం కంటే.. ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతాలో పడే ఇన్-హ్యాండ్ శాలరీ ఎంత అనేదే వాస్తవమైన లెక్కను గమనించుకోండి. సాహిల్ అన్నట్లుగా ఇలాంటి ఆఫర్లు ఒక లాటరీ టికెట్ లాంటివి. అందుకే గుడ్డిగా ప్యాకేజీల క్రేజ్ లో పడి వాస్తవాలు తెలుసుకోవటం మరువద్దు జెన్ జెడ్.