Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత రైబాకినా.. ఫైనల్లో సబలెంకాపై థ్రిల్లింగ్ విక్టరీ

Australian Open 2026: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విజేత రైబాకినా.. ఫైనల్లో సబలెంకాపై థ్రిల్లింగ్ విక్టరీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మహిళల విజేతగా ఎలెనా రైబాకినా నిలిచింది. మెల్‌బోర్న్‌లో శనివారం (జనవరి 31) జరిగిన మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ అరీనా సబలెంకాను ఓడించి టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో  రైబాకినా 6-4, 4-6, 6-4 తేడాతో ఓడించి తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడేళ్ల క్రితం 2023లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా చేతిలో ఓడిపోయిన రైబాకినా తాజా విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. రైబాకినాకు ఇదే తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం. 

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో రైబాకిన తొలి సెట్ గెలిచి ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో సబలెంకా చేతిలో ఓడిపోయింది. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపించింది. తొలి సెట్ ను రైబాకిన చాలా కూల్ గా 6-4తో గెలుచుకుంది. అయితే రెండో సెట్ లో మాత్రం సబలెంకా ధాటికి వెనకబడి పోయింది. ఈ నెంబర్ వన్ సీడ్ హార్డ్ హిట్టింగ్ దెబ్బకు రైబాకిన వద్ద సమాధానం లేకుండా పోయింది. కీలకమైన సమయంలో సర్వీస్ కోల్పోయి సెట్ ను 3-6 తేడాతో చేజార్చుకుంది. 

►ALSO READ | Under 19 World Cup 2026: వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియా పరిస్థితి ఏంటి..?

నిర్ణయాత్మక మూడో సెట్ ప్రారంభంలో అంతా సబలెంకా హవా కొనసాగింది. తన సర్వీస్ ను నిలుపుకోవడంతో పాటు రెండో గేమ్ లో రైబాకిన సర్వీస్ ను బ్రేక్ చేసి 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత తన సర్వీస్ నిలుపుకొని 3-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ సమయంలో   సబలెంకా విజయం ఖాయమని చాలామంది భావించారు. అయితే ఇక్కడ నుంచి రైబాకిన షో స్టార్ట్ అయింది. తన సర్వీస్ ను నిలుపుకొని తొలి గేమ్ గెలిచిన ఈ కజకిస్తాన్ ప్లేయర్ ఆ తర్వాత టాప్ లెవల్ ఆట తీరుతో చెలరేగిపోయింది. వరుసగా ఐదు గేమ్ లు గెలిచి 5-3 ఆధిక్యంలోకి వెళ్ళింది. తన సర్వీస్ ను జాగ్రత్తగా నిలుపుకొని మ్యాచ్ తో పాటు టైటిల్ కూడా గెలుచుకుంది.