హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఫామ్‌హౌస్‌లోనే విచారించాలన్న కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంటి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కేసీఆర్ తానుంటున్న నివాసానికి సంబంధించిన అడ్రస్‌తో సహా పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణమన్నారు.
ఇది అహంకారం కాకపోతే మరేమిటని మండిపడ్డారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా పోలీసులు అతిక్రమిస్తున్నారని సీరియస్ అయ్యారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా..? లేక ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా మారి ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా అని ప్రశ్నించారు.
చట్టం, న్యాయం, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు.. కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నదన్నారు. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తామని.. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామని పేర్కొన్నారు. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని.. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారని అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1న విచారణకు రావాలని కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బంజారాహిల్స్ నందీనగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. అయితే.. సీఆర్పీసీ 160 నిబంధనల ప్రకారం తన వయస్సు దృష్ట్యా ఫామ్ హౌజ్‌లోనే తనను విచారించాలని కేసీఆర్ సిట్ అధికారులను కోరారు. కేసీఆర్ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. ఫామ్ హౌజ్‌లో విచారణ కుదరదని.. నందీనగర్ నివాసంలో లేదా పోలీస్ స్టేషన్‌కు అయినా స్వయంగా వచ్చి విచారణకు సహకరించాలని పోలీసులు సూచించారు. దీంతో కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారని ఉత్కంఠ నెలకొంది.
