ఆ సంగతి నాకు తెల్వదు: సునేత్రాకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

ఆ సంగతి నాకు తెల్వదు: సునేత్రాకు డిప్యూటీ సీఎం పదవిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

ముంబై: దివంగత నేత అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‎ శనివారం (జనవరి 31) మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. విమాన ప్రమాదంలో అకాల మరణం చెందిన తన భర్త అజిత్ పవార్ స్థానంలో శనివారం సాయంత్రం 5 గంటలకు రాజ్ భవన్‎లో ఆమె ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార చేయనున్నారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో సునేత్రా పవార్‎కు డిప్యూటీ సీఎం పదవిపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సునేత్రా పవార్ ఉప ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారం తనకు తెలియదని చెప్పారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు సునేత్రా తనకు చెప్పలేదని పేర్కొన్నారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తత్కరే ఈ అంశంపై పార్టీలో, ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు పత్రికల్లో చూశానని తెలిపారు. దీనిపై వాళ్ల పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

నాలుగు నెలలు నుంచే డిస్కషన్:

ఎన్సీపీ విలీనం గురించి గత నాలుగు నెలలుగా అజిత్ పవార్, జయంత్ పాటిల్ చర్చలు జరుపుతున్నట్లు శరద్ పవార్ వెల్లడించారు. చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయని.. 2026, ఫిబ్రవరి 12న విలీనం గురించి ప్రకటన చేసేందుకు ముహుర్తం కూడా ఖరారు చేసినట్లు తెలిపారు. కానీ ఇంతలోనే అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడం దురదృష్టకరమని అన్నారు. అజిత్ పవార్ ఆఖరి కోరిక నేరవేరాలని భావిస్తున్నానమని పరోక్షంగా విలీనానికి ఒకే చెప్పారు. 

అజిత్ పవార్ సమర్థుడని.. నిబద్ధత కలిగిన నాయకుడని అభివర్ణించారు. అతను ఎల్లప్పుడూ ప్రజల కోసం నిజాయితీగా పని చేశాడని.. ప్రజా సమస్యలను లోతుగా అర్థం చేసుకున్నాడని కొనియాడారు. తన బాధ్యతలను నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకాడలేదని.. బారామతి ప్రజలకు అన్ని వేళలా అండగా నిలిచాడని అన్నారు. అజిత్ పవార్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరమైన ఆవేదన వ్యక్తం చేశారు. అజిత్ పవార్ నమ్మిన విలువలు, సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని నాయకులను కోరారు. పవార్ కుటుంబంలోని తదుపరి తరం కూడా ప్రజా సేవ కొనసాగిస్తోందని పేర్కొన్నారు.