చంద్రబాబు కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుంది: జగన్ సంచలన ట్వీట్.. 

చంద్రబాబు కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుంది: జగన్ సంచలన ట్వీట్.. 

విశాఖపట్నంలో చంద్రబాబు, ఆయన కుటుంబం ప్రభుత్వ భూములను లాగేసుకుందంటూ సంచలన ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్. హలో ఇండియా... ఇది వేకప్ కాల్ అంటూ.. శనివారం ( జనవరి 31 ) ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు జగన్. చంద్రబాబు, అయన కుటుంబం విశాఖపట్నంలో రూ. 5 వేల కోట్ల విలువజేసే ప్రభూత్వ భూములను లాగేసుకుందని అన్నారు జగన్. రుషికొండ సమీపంలో ఉన్న 54.79 ఎకరాల అత్యంత విలువైన భూములను అధికార దుర్వినియోగం ద్వారా బహిరంగంగానే కబ్జా చేసేసిందని అన్నారు. 

సీఎం చంద్రబాబు అత్యంత విలువైన ఈ భూమిని తన సొంత కుటుంబ సభ్యుడైన  విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్‌కు కట్టబెట్టేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరిగి స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ వేసిన భూములను  ఇప్పుడు మళ్లీ  చంద్రబాబుగారు తన కుటుంబానికి ఉచితంగా బహుమానంగా ఇచ్చేశారని అన్నారు జగన్. ఈ విలువైన భూములను లోకేష్ తన తోడల్లుడికి కట్టబెట్టడం, చంద్రబాబు కుటుంబ కుట్రను బయటపెడుతోందని అన్నారు. లోకేష్‌ కు ఎలాంటి అధికార పరిధి లేకపోయినా, విద్యాశాఖ నుంచి ఒక మెమో జారీ చేసి ఈ భూములను తన తోడల్లుడికి కేటాయించేలా చేశారని అన్నారు జగన్. 

ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు వైసీపీ కార్పొరేటర్లు ధైర్యంగా నిలబడితే, వారిపై భౌతిక దాడులు చేసి బలవంతంగా బయటకు  తోసేశారని... ఈ దాడుల్లో పలువురు వైయస్సార్‌సీపీ కార్పొరేటర్లు గాయపడగా, పోలీసులు పట్టించుకోకుండా  ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు జగన్.

►ALSO READ | గుంటూరులో హైటెన్షన్.. అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ

ఈ భూ దోపిడీని అమలు చేయడానికి చంద్రబాబు, బీసీ యాదవ వర్గానికి చెందిన వైసీపీ మహిళా మేయర్‌ను తొలగించారని.. కార్పొరేటర్లను కొనుగోలు చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను బుల్డోజ్ చేసి రూ.5 వేల కోట్ల విలువైన ఆస్తిని తన కుటుంబ సభ్యులకు కానుకగా ఇచ్చారని అన్నారు జగన్. 

చంద్రబాబు అధికారంలో ఉన్న ప్రతిసారీ ప్రభుత్వ ఆస్తులు మాయమవుతాయని... వారి కుటుంబ ఆస్తులు పెరుగుతాయని... ఇది యాదృచ్ఛికం కాదు, ఒక పరిపాటిగా జరిగిపోతుందని అన్నారు జగన్. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లు తమ పాలనను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనడంలో ఎలాంటి సందేహం లేదని ట్వీట్ చేశారు జగన్.