వెళ్లొస్తమమ్మా.. మళ్లీ రెండేండ్లకు కలుద్దాం.. మేడారం నుంచి తిరుగు పయనమైన భక్తులు

వెళ్లొస్తమమ్మా.. మళ్లీ రెండేండ్లకు కలుద్దాం.. మేడారం నుంచి తిరుగు పయనమైన భక్తులు
  • మమ్ముల్ని సల్లంగా సూడు తల్లీ
  • చివరి ఘట్టానికి సమ్మక్క, సారలమ్మ జాతర 
  • గద్దెల వద్ద గిరిజన పూజారుల ప్రత్యేక పూజలు 
  •  డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్లనడుమ అమ్మవార్ల వన ప్రవేశం
  • నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన మహా జాతర
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు

6 మేడారం టీం (ములగు): మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగిన మహా జాతర ఇవాళ్టితో (జనవరి 31) ముగియనుంది. తల్లుల వనప్రవేశంతో వన జాతర పూర్తి కానుంది. 

సాయంత్రం సమయంలో గద్దెలను పరిశుభ్రం చేసి, గిరిజన పూజారులు అమ్మవార్లకు సంప్రదాయ పూజలను నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో డోలు వాయిద్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ దేవతల పనప్రవేశం కార్యక్రమం ఆరంభమవుతుంది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాఘట్టం జనవరి 28 నుంచి 31వరకు జరుగగా.. ఇవాళ సాయంత్రం వరకు భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తరలివచ్చారు. 

జంపన్నవాగులో పుణ్య స్నానాలను ఆచరించి వన దేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. సమ్మక్క సారలమ్మలకు చీర, ఒడిబియ్యం, సారె పోసి దేవతలను మనసారా కొలుచుకున్నారు. సమ్మక్క ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, సిద్దబోయిన మునీందర్, సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్యలు పూజల అనంతరం పనప్రవేశం చేయిస్తారు. సమ్మక్కతల్లి చిలుకల గుట్టకు వెళ్లనుండగా సారలమ్మ కన్నెపల్లికి చేరుకోనున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం మండలం కొండాయికి గోవిందరాజు, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల కు పగిడిద్ద రాజును తిరిగి చేర్చనున్నారు. ఈ తంతుతో మహాజాతర ముగిస్తుం ది. అమ్మవార్ల దర్శనం అనంతరం మళ్లీ వస్తాం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు పయనమయ్యారు.

బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు

జాతరలో చివరిరోజు మేడారంలోని వసదేవతలను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ అమ్మవార్లకి మొక్కులను సమర్పించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు వారికి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. హైకోర్టు జడ్జిలు సృజన, రాణి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో భక్తులు నానా అవస్థలు పడ్డారు. దర్శనం సాఫీగా జరిగినా, రిటర్న్ జర్నీ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని వాపోయారు. గంటల కొద్దీ బస్సుల కోసం వేచి ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.