ఆ పులి మహా ముదురు!..ప్రస్తుతం యాదాద్రి, సిద్ధిపేట బార్డర్ లో సంచారం

ఆ పులి మహా ముదురు!..ప్రస్తుతం యాదాద్రి, సిద్ధిపేట బార్డర్ లో సంచారం
  • ఫారెస్ట్​ ఆఫీసర్లకు సవాల్​గా మారిన టైగర్​ ఆచూకీ
  • కెమెరాలకు దొరకట్లే.. ఎర వేస్తే చిక్కట్లే

హైదరాబాద్, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాలో మహారాష్ట్ర నుంచి వచ్చిన పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది మామూలు పులిలా కాకుండా.. మహా ముదురులా ప్రవర్తిస్తున్నది.15 రోజులుగా ఫారెస్ట్​ఆఫీసర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. వందల కెమెరాలు, ట్రాప్ కెమెరాలు పెట్టినా దాని పూర్తి ఫొటో ఇంతవరకు దొరకలేదు. ఒకసారి పశువును వేటాడినప్పుడు కెమెరాలో కనిపించినా ముఖచిత్రం స్పష్టంగా తెలియలేదు. 

ఫారెస్ట్ అధికారులు ఎర వేసినా వైపు వెళ్లకుండా స్థావరాలు మారుస్తున్నది. ప్రస్తుతం పులి యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాల సరిహద్దులో సంచరిస్తున్నది. మహారాష్ట్ర నుంచి మొదలైన దీని ప్రస్థానం యాదాద్రి గుట్టల్లో దాగుడు మూతలాడుతోంది. ఇన్ని రోజులవుతున్నా.. అసలు ఆ పులి ఎందుకు చిక్కడం లేదనేది ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది.

ఎందుకు దొరకట్లేదు? 

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలుదేరిన పెద్దపులి.. 2500 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి యాదాద్రికి చేరుకుంది. ఇది తావు కోసమో.. లేక తోడు కోసమో ఇంత దూరం వచ్చిందని అంచనా. సాధారణంగా పులికి ఆకలి వేస్తే వేటాడుతుంది. లేదా ఎర వేస్తే చిక్కుతుంది. కానీ ఈ పులి తీరు విభిన్నంగా ఉందని ఫారెస్ట్​ఆఫీసర్లు చెప్తున్నారు. అటవీశాఖ అధికారులు, ట్రాకర్లు, పోలీసులు వందల సంఖ్యలో గాలిస్తున్నారు. 

మనుషుల అలికిడి, వాసనను ఇది కిలోమీటర్ల దూరం నుంచే పసిగడుతోంది. జనం ఉన్న వైపు కాకుండా నిర్మానుష్య ప్రాంతాల వైపు పయనిస్తోంది. పగలు గుట్టలు, పొదల్లో విశ్రాంతి తీసుకుని, రాత్రివేళలో బయటకొచ్చి వేటాడుతున్నది. జనసంచారం లేని సమయంలోనే సంచరిస్తుండటంతో దాని జాడ దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. యాదాద్రి జిల్లాలోని రాళ్లు, రప్పలు, గుట్టలు రక్షణ కవచాలుగా మారడంతో పులి ఆచూకీ అధికారులకు చిక్కడం లేదు. 

వేటాడిన చోటుకు మళ్లీ రావడం లేదు.. 

సాధారణంగా పులి వేటాడిన జంతువును సగం తిని, మిగతా సగం తినడానికి మరుసటి రోజు అదే ప్రదేశానికి వస్తుంది. అధికారులు అక్కడే కెమెరాలు పెడతారు. కానీ ఈ పులి మాత్రం వేటాడిన చోటికి మళ్లీ రావడం లేదు. ఒక రోజు కనిపించిన ప్రాంతంలో మరుసటి రోజు కనిపించడం లేదు. రాత్రికి రాత్రే 18 నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తూ స్థావరాలు మారుస్తోంది. సైలెంట్​గా పశువులపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోతోంది. 

జనవాసాలకు దూరంగా ఉంటూనే.. నీటి వనరులు ఉన్న వైపు వెళ్తున్నట్లు పాద ముద్రల ద్వారా తెలుస్తున్నది. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక బృందాలు ఇటు యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నాయి.  పులి ఆకలితో ఉంటే ప్రమాదకారిగా మారుతుందని.. అందువల్ల జనం అప్రమత్తంగా ఉండాలని ఓ సీనియర్​ ఫారెస్ట్​ ఆఫీసర్ హెచ్చరించారు.