మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు... రాళ్లు కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి..

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి నిప్పు... రాళ్లు కర్రలతో టీడీపీ కార్యకర్తల దాడి..

ఏపీలో రాజకీయం అట్టుడుకుతోంది. తిరుమల లడ్డూ వివాదం అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మాటల యుద్ధం ఒక పక్క.. వైసీపీ నేతల ఇళ్లపై టీడీపీ కార్యకర్తల దాడులు మరొక పక్క వెరసి రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. శనివారం అంబటి రాంబాబు ఎపిసోడ్ జరిగి 24 గంటలు గడవక ముందే మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడికి దిగారు టీడీపీ కార్యకర్తలు. 

విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న జోగి రమేష్ ఇంటిపై రాళ్లు, కర్రలతో దాడికి దిగిన టీడీపీ శ్రేణులు ఆయన ఇంటికి నిప్పంటించారు. ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

జోగి రమేష్ ఇంట్లో భారీగా మంటలు అలుముకున్నాయి.. దట్టమైన పొగ కమ్మేసింది. జోగి రమేష్ ఇంటి ముందు ఫ్లెక్సీలు చించేసి హంగామా సృష్టించారు టీడీపీ కార్యకర్తలు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. కూటమి పాలనలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని అంటున్నారు.

కాగా.. ఇటీవల కల్తీ మద్యం కేసులో అరెస్టయ్యి బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కు చిప్ దెబ్బతిందని... కల్తీ మాటలతో టీడీపీ కల్తీ అయ్యిందని అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. చంద్రబాబు, లోకేష్ లపై జోగి రమేష్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ క్యాడర్ ఆయన ఇంటిపై దాడికి దిగినట్లు తెలుస్తోంది.