ఉద్యోగులకు నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇకపై మీ పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకోవడానికి గంటల కొద్దీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ATM ద్వారా లేదా UPI (PhonePe, Google Pay) ద్వారా కూడా మీ డబ్బును తీసుకునే సరికొత్త సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోంది. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం ATM, UPI ద్వారా పీఎఫ్ విత్ డ్రా సౌకర్యం మార్చి 2026 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే రకరకాల ఫార్మ్స్ నింపాలి, ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లై చేయాలి, కొన్నిసార్లు కంపెనీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ తిప్పలన్నీ లేకుండా మీ డబ్బును మీకు సులభంగా అందించడానికి ప్రభుత్వం ఈ కొత్త వెసలుబాటు తీసుకొస్తుంది. పీఎఫ్ (EPF) డబ్బులు మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో నుండి 75 శాతం వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు.
ATM/UPI లింక్ ద్వారా పీఎఫ్ అకౌంట్ నేరుగా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం వల్ల సాధారణ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసినంత ఈజీగా పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ఇందుకు పేపర్ వర్క్ ఉండదు అలాగే అప్లికేషన్లు పెట్టుకోవడం, తిరస్కరణ కావడం వంటి ఇబ్బందులు ఉండవు. గతంలో పీఎఫ్ విత్‌డ్రా కోసం 13 రకాల విభాగాలు ఉండేవి, వాటన్నింటినీ కలిపి ఇప్పుడు కేవలం ఒకే ఒక పద్ధతిగా మార్చారు.
దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ చేతికి అందుతుంది. ATM, UPI వాడకం అందరికీ అలవాటే కాబట్టి, సామాన్య ఉద్యోగికి కూడా ఈ ఫీచర్ చాలా ఈజిగా ఉంటుంది. అక్టోబర్ 2025లోనే పీఎఫ్ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వాటికి కొనసాగింపుగానే ఈ ATM/UPI సదుపాయాన్ని తీసుకువస్తున్నారు.
