- పాదచారులు, వాహనాల జోలికి వెళ్తే సహించబోం
- డీజేలకు అనుమతి లేదు: సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హోలీ సందర్భంగా బలవంతంగా రంగులు చల్లితే కేసులు నమోదు చేస్తామని హైదరాబాద్నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సజ్జనార్మాట్లాడుతూ హోలీ సందర్భంగా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది గస్తీ పెంచాలన్నారు. ఇష్టం లేని వారికి బలవంతంగా రంగులు పూయడం, పాదచారులు, వాహనాలపై రంగులు చల్లడాన్ని సహించబోమన్నారు. మహిళల రక్షణ కోసం మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంచాలన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
మద్యం షాపులు బంద్
హోలీ సందర్భంగా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ల పరిధిలో మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసి ఉంచాలని పోలీస్కమిషనర్లు సజ్జనార్, రమేశ్, అవినాష్‌మహంతి, సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవన్నారు.
రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు అంతరాయం కలగకుండా చూడాలని, పీస్ కమిటీలతో సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్సీపీ తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు శ్వేత, ఎస్ఎం విజయ్ కుమార్, డీసీపీలు ఖారే కిరణ్ ప్రభాకర్, రూపేశ్, వెంకట లక్ష్మి పాల్గొన్నారు.
హోలీ వేళ జాగ్రత్తలివీ: గాంధీ కంటి విభాగం హెచ్ఓడీ డా. రవిశేఖర్
- చర్మం, కండ్లకు హాని కలగకుండా సహజసిద్ధమైన రంగులను మాత్రమే వాడాలి.
- ఆడేప్పుడు కండ్లద్దాలు పెట్టుకుంటే రంగులు కళ్లలోకి వెళ్లే ప్రమాదం తగ్గుతుంది.
- రంగులు కంట్లో పడితే కళ్లను రుద్దకూడదు. శుభ్రమైన నీటితో బాగా కడగాలి.
- కండ్లు ఎర్రబారడం, మంట, వెలుగును చూడడంలో ఇబ్బంది ఉంటే లూబ్రికేటింగ్ డ్రాప్స్ లేదా ఆయింట్‌మెంట్ వాడాలి..అవసరమైతే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి.
- రంగులు చల్లే గొట్టాలు, ఇతర వస్తువులు కంటికి తాకితే కంటిపై ఒత్తిడి చేయకుండా బ్యాండేజ్ వేసి కంటి దవాఖానకు వెళ్లాలి.
- చర్మ సమస్యలు రాకుండా పూర్తి శరీరాన్ని కప్పేలా బట్టలు వేసుకుంటే మంచింది.
