న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ ఉద్రిక్తతల వల్ల సోమవారం (మార్చి 03) బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ లెక్కల ప్రకారం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర రూ.3,300 మేర పెరిగి రూ.1.64 లక్షల మార్కుకు చేరింది. వెండి ధర కిలోకు రూ.ఎనిమిది వేలు పెరిగి రూ.2.72 లక్షల వద్ద నిలిచింది.
గ్లోబల్ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం మేర ఎగబాకి ఔన్సుకు 5,400 డాలర్ల పైకి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండి ధర 2.6 శాతం పెరిగి 95.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్లోనూ ధరలు పెరిగాయి. ధర 5.34 శాతం పెరిగి రూ.1.67 లక్షలకు చేరింది.
క్రితం ముగింపు రూ.1.58 లక్షలతో పోలిస్తే ఇది రూ.ఎనిమిది వేలు పెరిగింది. వెండి ధరలు కూడా 9.09 శాతం మేర భారీగా ఎగబాకాయి. కిలో వెండి ధర రూ.24,181 పెరిగి రూ.2.90 లక్షల మార్కును దాటింది.
