డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్... పట్టణాల్లో అయితే 4.. గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి : సర్కారుకు విద్యా కమిషన్ సిఫార్సులు

డిగ్రీ కాలేజీకి 4 ఎకరాల జాగా మస్ట్... పట్టణాల్లో అయితే 4.. గ్రామాల్లో 8 ఎకరాలు తప్పనిసరి : సర్కారుకు విద్యా కమిషన్ సిఫార్సులు
  • ఇంటర్​లోనూ అర్బన్​లో 2.. రూరల్​లో 4 ఎకరాలు ఉంటేనే అనుమతి 
  • జూనియర్ లెక్చరర్లకు బీఈడీ, టెట్ ఉండాలి
  • ఇంటర్ ఒకేషనల్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్​లో విలీనం చేయాలి 
  • సర్కారుకు ఇచ్చిన నివేదికలో విద్యా కమిషన్ సిఫార్సులు

హైదరాబాద్, వెలుగు: కనీసం గాలి, వెలుతురు సోకని అపార్ట్​మెంట్లలో తరగతులు పెట్టి, విద్యార్థులకు జైలు తరహా పరిస్థితులను కల్పిస్తున్న   కాలేజీలకు కళ్లెం వేసేలా రాష్ట్ర విద్యా కమిషన్ సర్కారుకు​ పలు కీలక సిఫార్సులు చేసింది. ఇకపై రాష్ట్రంలో కొత్తగా డిగ్రీ, జూనియర్ కాలేజీ పెట్టాలన్నా, ఉన్న వాటిని కొనసాగించాలన్నా  కనీస మౌలికసదుపాయాలు ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. 

కేవలం భవనాలే కాదు.. విద్యార్థులకు పాఠాలు చెప్పే లెక్చరర్ల క్వాలిఫికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ భారీ మార్పులను ప్రతిపాదించింది. ఈ మేరకు విద్యా కమిషన్ తమ నివేదికను ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డికి అందజేసింది. ఇది అమల్లోకి వస్తే కనీస గ్రౌండ్​ లేకుండా అపార్ట్​మెంట్లలో 
నడుస్తున్న కాలేజీలకు చెక్​ పడినట్లేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో కాలేజీలకు నో పర్మిషన్..

ప్రస్తుతం రాష్ట్రంలో అనేక ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో నడుస్తున్నాయి.  వీటికి చెక్ పెట్టేలా కమిషన్ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించింది. కమిషన్ సిఫార్సుల ప్రకారం.. డిగ్రీ కాలేజీకి అర్బన్ ఏరియాల్లో కనీసం 4 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 8 ఎకరాల సొంత స్థలం ఉండాలి. దీనిలో పట్టణాల్లో 15 శాతం, గ్రామాల్లో 30 శాతం స్థలాన్ని గ్రీనరీ కోసం కేటాయించాలని సూచించింది. 

భవిష్యత్తులో నిర్మించే భవనాలు కనీసం వంద ఏండ్ల పాటు నిలిచేలా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కమిషన్ స్పష్టం చేసింది. మరోపక్క జూనియర్ కాలేజీల్లోనూ ల్యాండ్ విధానం అమలు చేయాలని ప్రతిపాదించింది. పట్టణాల్లో కనీసం రెండు ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4 నుంచి 5 ఎకరాల సొంత స్థలం ఉంటేనే జూనియర్ కాలేజీకి అనుమతి ఇవ్వాలని పేర్కొన్నది. అలాగే, మూస పద్ధతిలో జరిగే పరీక్షా విధానానికి స్వస్తి పలికి.. 30 శాతం మార్కులు ఇంటర్నల్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్ వర్కులకు..  మిగిలిన 70 శాతం మాత్రమే ఎక్స్టర్నల్ రాత పరీక్షలకు కేటాయించాలని సూచించింది.

ఎఫ్​ఆర్​ఎస్​తో స్కాలర్​షిప్స్​కు​ లింక్..

కాలేజీలకు డుమ్మా కొట్టే విద్యార్థులు, చెప్పకుండా కాలేజీలకు రాని లెక్చరర్లకు చెక్ పెట్టేందుకు టెక్నాలజీని వాడాలని కమిషన్ అభిప్రాయపడింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్ విధానాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. 

అటెండెన్స్ పక్కాగా ఉంటేనే స్కాలర్​షిప్​లు, ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. మరోపక్క రాష్ట్రంలోని ఎయిడెడ్ కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే చట్టం ద్వారా స్వాధీనం చేసుకోవాలని సూచించింది. వాటిని పూర్తిగా ప్రభుత్వ కాలేజీలుగా మార్చి, పేద విద్యార్థులకు ఉచితంగా లేదా తక్కువ ఫీజుతో విద్యను అందించాలని కోరింది.

ప్రిన్సిపాల్ పోస్టుకు పరీక్ష..

సర్కారు డిగ్రీ కాలేజీల పాలనా వ్యవహారాలను వికేంద్రీకరించాలని కమిషన్ ప్రతిపాదించింది. ఇప్పటివరకు కమిషనర్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ పరిధిలోని అధికారాలను జిల్లాల వారీగా బదిలీ చేయాలని సూచించింది.  ప్రతి ప్రభుత్వ కాలేజీకి ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసి, దానికి జిల్లా కలెక్టర్ ను చైర్మన్​గా నియమించాలని పేర్కొంది. 

సర్కారు డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పోస్టులను ఇకపై ప్రమోషన్ల ద్వారా కాకుండా.. ఓపెన్ రిక్రూట్​మెంట్ (పరీక్ష/ఇంటర్వ్యూ) ద్వారా భర్తీ చేయాలని చెప్పింది. రాష్ట్రంలో ఒక్కో వర్సిటీ ఒక్కో రకంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, దీన్ని నివారించేందుకు అన్ని యూనివర్సిటీలకు ఒకే అకడమిక్ క్యాలెండర్ ఉండాలని కమిషన్ స్పష్టం చేసింది. 

జూనియర్ లెక్చరర్ పోస్టులకు టెట్ మస్ట్ 

ఇప్పటివరకు కేవలం పీజీ అర్హతతో జూనియర్ లెక్చరర్లుగా ఎంపికవుతుండగా.. ఇకపై ఆ పద్ధతికి స్వస్తి పలకాలని కమిషన్ ప్రభుత్వానికి సూచించింది. భవిష్యత్తులో జూనియర్ లెక్చరర్ పోస్టుకు పోటీ పడాలంటే బీఈడీతో పాటు టెట్ క్వాలిఫై తప్పనిసరి అని తేల్చి చెప్పింది. స్కూల్ టీచర్లకు అమలు చేస్తున్న నిబంధనలనే కాలేజీ లెక్చరర్లకు కూడా వర్తింపజేయాలని సూచించింది. డిగ్రీ, పీజీలో కనీసం 60% మార్కులు వచ్చిన వారికే జేఎల్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండాలంది. 

స్కూల్ పిల్లల మాదిరిగానే గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చదివే పిల్లలకూ మిడ్​ డే మీల్స్ అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. దీంతో పాటు ఆత్మహత్యల నివారణకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాలని, ప్రతి కాలేజీలో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.  ప్రస్తుతం ఇంటర్మీడియెట్ లోని వొకేషనల్ కోర్సులను ఐటీఐ లేదా పాలిటెక్నిక్ కాలేజీలకు బదిలీ చేయాలని ప్రతిపాదించింది. 

పెద్ద కాలేజీల్లో చిన్నవి విలీనం..

కాలేజీల్లోని వనరులను సమర్థవంతంగా వాడుకునేందుకు క్లస్టర్ విధానాన్ని కమిషన్ తెరపైకి తెచ్చింది. ఒకే మండలంలో 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ, గురుకుల కాలేజీ, మోడల్ స్కూల్.. ఇలా ఏవైనా ఉంటే వాటన్నింటినీ కలిపి ఒకే అడ్మినిస్ట్రేషన్ కిందకు తేవాలని సూచించింది. వీటిలో ఏది పెద్ద క్యాంపస్/మౌలిక వసతులు కలిగి ఉంటే, మిగిలిన చిన్న కాలేజీలను అందులో విలీనం చేయాలని పేర్కొన్నది. రాష్ట్రంలో జూనియర్ కాలేజీ లేని 74 మండలాల్లో వెంటనే ప్రభుత్వ కాలేజీని ఏర్పాటు చేయాలని సూచించింది.

ప్రతి ఐదేండ్లకు ఎగ్జామ్.. 

ఒకసారి ప్రభుత్వోద్యోగం వస్తే ఇక చదువుతో పనిలేదనుకునే లెక్చరర్లకు కమిషన్ షాక్ ఇచ్చింది. విద్యా ప్రమాణాలు పెంచేందుకు జూనియర్ లెక్చరర్లకు ప్రతి 5 ఏండ్లకోసారి ప్రొఫెషనల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఎగ్జామ్ నిర్వహించాలని, అందులో క్వాలిఫై అవ్వడం తప్పనిసరి అని సూచించింది. అలాగే, ఇప్పటివరకు డిపార్ట్ మెంట్ లోని క్లర్కులు, అటెండర్లు వంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కు, కారుణ్య నియామకాల ద్వారా వచ్చేవారికి లెక్చరర్లుగా ప్రమోషన్లు ఇస్తున్నారు. ఇకపై ఈ విధానాన్ని రద్దు చేయాలని, ప్రిన్సిపాల్ పోస్టుల్లో కేవలం అకడమిక్ సిబ్బందే ఉండాలని స్పష్టం చేసింది.