- 313 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ రూ.6.5 లక్షల కోట్ల సంపద ఆవిరి
- క్షీణించిన రూపాయి.. 41 పైసలు కిందకు
- భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు
- త్వరలోనే 100 డాలర్లకు చేరుతుందని అంచనా
- గోల్డ్ రూ.3,300, కిలో వెండి రూ.8 వేలు జంప్
ముంబై: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రం కావడంతో స్టాక్ మార్కెట్లు సోమవారం చిగురుటాకులా వణికాయి. పరిస్థితి దిగిజారుతూనే ఉండటంతో సూచీలు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లకు పైగా క్షీణించి 80,239 వద్ద ముగిసింది. నిఫ్టీ–50 313 పాయింట్లు పడిపోయి 24,866 వద్ద స్థిరపడింది. రెండు ప్రధాన సూచీలు దాదాపు నెల రోజుల కనిష్ట స్థాయికి చేరాయి. ఈ భారీ పతనం వల్ల బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.6.5 లక్షల కోట్ల వరకు తగ్గింది.
దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ.457 లక్షల కోట్లకు పడిపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 2,743 పాయింట్లు పతనమై 78,543 వద్ద, నిఫ్టీ 519 పాయింట్లు నష్టపోయి 24,659 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొంత కోలుకున్నప్పటికీ నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్‌లో ఇండిగో, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకీ షేర్లు ఆరు శాతం దాకా నష్టపోయి టాప్ లూజర్లుగా నిలిచాయి. యుద్ధం తీవ్రతరం కావడంతో రక్షణ రంగ షేర్లకు డిమాండ్ పెరిగింది. బీఈఎల్ షేర్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆటో అత్యధికంగా 2.2 శాతం నష్టపోయింది. నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కూడా రెండు శాతానికి పైగా పడ్డాయి.
విదేశీ పెట్టుబడులు వెనక్కి
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్ఐఐలు) భారత మార్కెట్ల నుంచి నిధులను భారీగా వెనక్కి తీసుకుంటున్నారు. ఎన్ఎస్ఈ లెక్కల ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం రూ.7,536 కోట్ల విలువైన షేర్లను, సోమవారం రూ.5,467 కోట్ల షేర్లను విక్రయించారు. వీళ్లు అమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తుండటంతో మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. దేశీయ పెట్టుబడిదారులు (డీఐఐలు) శుక్రవారం రూ.12,293 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు, సోమవారం రూ.8,594 కోట్ల షేర్లను కొన్నారు.
రూపాయి 41 పైసలు పతనం
ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ భారీగా పతనమైంది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో దీని విలువ 41 పైసలు క్షీణించి డాలర్‌తో పోలిస్తే రూ.91.49 వద్ద స్థిరపడింది. ఎఫ్ఐఐలు రూ.3,295 కోట్లకు పైగా విలువైన షేర్లను విక్రయించడం కరెన్సీపై ఒత్తిడిని పెంచింది. ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి విలువ రూ.91.50 స్థాయి వద్ద కొంత వరకు నిలకడగా ఉంది. ముడి చమురు ధరలు పెరగడం వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరిగే ముప్పు ఉందని ఎల్కేపీ సెక్యూరిటీస్ నిపుణులు హెచ్చరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్లు డాలర్ వైపు మళ్లుతున్నారని తెలిపారు.
