- బోర్డు, ప్రైవేట్ ఎస్టీపీల నుంచి నీటి సేకరణ
- బిల్డింగుల నిర్మాణం, గార్డెనింగ్‌కు ఉపయోగించేలా ప్రణాళిక
- నామినల్చార్జీలతో సరఫరా
హైదరాబాద్‌సిటీ, వెలుగు:గ్రేటర్ లో రోజు రోజుకూ భారీగా పెరుగుతున్న నీటి డిమాండ్‌ను అధిగమించడంతో పాటు, శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించుకునేలా వాటర్బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఔటర్వరకూ బోర్డును విస్తరించడంతో నీటికి భారీగా డిమాండ్పెరుగుతోంది. దీంతో పాటు వృథా కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ‘గ్రే వాటర్బ్యాంక్’ను ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది.
కేవలం బోర్డు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే కాకుండా ప్రైవేట్ సంస్థలు అంటే భారీ అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి కూడా శుద్ధి చేసిన నీటిని సేకరించనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రీటెడ్ వాటర్నిల్వచేసేందుకు రిజర్వాయర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ నీటిని గార్డెనింగ్, ప్లాంటేషన్, భవన నిర్మాణాలకు సరఫరా చేయాలని అనుకుంటున్నారు.
కన్సల్టెన్సీకి డీపీఆర్ బాధ్యతలు
శుద్ధి చేసిన నీటిని వాడుకునే విషయమై డీపీఆర్ తయారీకి ఇటీవలే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఠండన్కు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ గ్రేటర్‌పరిధిలో ఉత్పత్తి అవుతున్న లెక్కలోకి రాని మురుగునీరు ఎంత? ప్రస్తుతం అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండస్ట్రీస్‌లో నిర్వహిస్తున్న ఎఫ్ల్యూయెంట్ ప్లాంట్(పరిశ్రమలు, అపార్ట్మెంట్లలో నీటి శుద్ధి ప్లాంట్లు)లలో ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతోంది? ఎంత శుద్ధి జరుగుతోంది? శుద్ధి చేసిన నీటిని ఏం చేస్తున్నారన్న విషయాన్ని స్టడీ చేస్తారు. భవిష్యత్‌లో ట్రీటెడ్వాటర్ మేనేజ్మెంట్పై నివేదికను అందజేస్తారు.
డయల్ ఏ గ్రేటర్ట్యాంకర్
మెట్రోవాటర్‌బోర్డు గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో 40 ఎస్టీపీలను నిర్వహిస్తోంది. సిటీలో రోజుకు 1950 ఎంల్ఎల్డీల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా..ఇందులో రోజుకు 950 ఎంఎల్డీలు మాత్రమే శుద్ధి జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో మరో 39 ఎస్టీపీలు సిద్ధమవుతాయి. దీంతో వంద శాతం మురుగునీటి శుద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు కొన్ని పరిశ్రమల్లోనూ మురుగునీటి శుద్ధి ప్లాంట్లున్నాయి. ఆయా సంస్థల పరిధిలో 500 వరకూ ఎస్టీపీలున్నాయి. ప్రస్తుతం వాటర్ బోర్డు శుద్ధి చేసిన నీటిని మూసీలోకి వదులుతుండగా, ప్రైవేట్ సంస్థలకు చెందిన ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని డ్రైనేజీల్లోకి వదులుతున్నారు.
ఈ పరిస్థితిని అధిగమించడానికి త్వరలో ప్రైవేట్ఎస్టీపీల నుంచి కూడా శుద్ధి చేసిన నీటిని సేకరించనున్నారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రిజర్వాయర్లను, తర్వాత సరఫరా చేసేందుకు ఫిల్లింగ్‌స్టేషన్లను నిర్మించనున్నారు. ప్రైవేట్‌సంస్థల నుంచి సేకరించిన నీటి నాణ్యతను బట్టి వారికి కొంత మొత్తాన్ని కూడా చెల్లించనున్నారు. ఇందు కోసం సిటీలోని ప్రైవేట్ఎస్టీపీల వివరాలను బోర్డు అప్డేట్చేస్తోంది. ఎప్పటికప్పుడు వారు ఉత్పత్తి చేసిన ట్రీటెడ్వాటర్ క్వాంటిటీ, క్వాలిటీపై అధికారులు మానిటర్చేస్తారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు బుకింగ్ కోసం వాటర్బోర్డు ఐటీ ప్లాట్‌ఫామ్‌ను వినియోగిస్తారు. డయల్ ఏ వాటర్ట్యాంకర్లాగా డయల్ఏ గ్రేటర్ ట్యాంకర్ అందుబాటులోకి తీసుకు వస్తారు.
నామమాత్రపు చార్జీలతో సరఫరా
గ్రేటర్‌పరిధిలోని అన్ని ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని.. భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఓఆర్ఆర్పొడవునా ప్లాంటేషన్‌కు, నగరంలోని గార్డెనింగ్పనుల కోసం, క్లీనింగ్అవసరాలకు నామమాత్రపు చార్జీలతో సరఫరా చేయనున్నారు. దీనివల్ల తాగునీటిని ఇతర అవసరాలకు వాడే అవకాశం ఉండదని, నీటి వృథాను అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు.
