- భూములు సేకరించి కాలనీల ఏర్పాటుకు హెచ్ఎండీఏ నిర్ణయం
- ఇండ్లు, అపార్ట్మెంట్లు, హాస్పిటల్స్, పార్కులు, విద్యాసంస్థల నిర్మాణం
- ఇప్పటికే 18 రేడియల్ రోడ్లలో రెండు ఖరారు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్వరకు విస్తరించిన నేపథ్యంలో ఎంపిక చేసిన గ్రామాలను పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలను నివాసాలకు అనుగుణంగా రూపుదిద్దేందుకు లోకల్ ఏరియా డెవలప్మెంట్ ప్లాన్(ఎల్ఏడీపీ)ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాలను క్లస్టర్స్‌గా తీసుకుని ఎల్ఏడీపీ కింద డెవలప్ చేయనున్నారు. ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే భవిష్యత్‌లో హెచ్ఎండీఏ మనుగడ సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
రైతుల నుంచి భూములు సేకరించి..
ఇటీవల జీహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకూ విస్తరించడంతో భవిష్యత్ లో హెచ్ఎండీఏకు ఆదాయ వనరులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఆర్పరిధిలోని ఎంపిక చేసిన గ్రామాల్లోని భూములను రైతుల నుంచి సేకరించి కాలనీలను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇలా అభివృద్ధి చేసిన భూముల్లో 60 శాతం నివాస ప్రాంతాలుగా, మరో 30 శాతం భూములను హాస్పిటల్స్, పార్కులు, కాలేజీలు, స్కూళ్లు, విద్యుత్కేంద్రాల ఏర్పాటుకు కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. మిగిలిన10 శాతం భూములతో హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ భూములను భవిష్యత్అవసరాలకు వినియోగించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు ప్రస్తుతమున్న భూసేకరణ విధానంలోనూ మార్పులు చేసి కాంప్రహెన్సివ్ ల్యాండ్ పూలింగ్పాలసీని తీసుకురావాలని అనుకుంటున్నారు.
రేడియల్ రోడ్లు.. కొత్త లే ఔట్లు..
ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ పరిధి పెరిగినా, ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో డెవలప్మెంట్లేకపోవడంతో ఎల్ఏడీపీ కింద రోడ్లను నిర్మించి కొత్త లేఔట్లను ఏర్పాటు చేయాలని హెచ్ ఎండీఏ అనుకుంటోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో భవనాలు, అపార్ట్మెంట్లు పెరిగి ఆదాయమూ పెంచుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటికే ఓఆర్ఆర్నుంచి ట్రిపుల్ఆర్వరకూ రేడియల్ రోడ్లను నిర్మించడానికి పూనుకుంది. ప్రస్తుతం18 రేడియల్ రోడ్లలో రెండింటిని ఇప్పటికే ఖరారు చేసింది.
