- క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి నివేదికలు
- జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఆర్టీఏ డిపార్ట్‌మెంట్లపైనే ఎక్కువ కంప్లైంట్స్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అంతర్గత విచారణ జరుపుతోంది. జీహెచ్‌ఎంసీ సహా వివిధ శాఖలపై వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా వివరాలు సేకరిస్తూ సంబంధిత డిపార్ట్‌మెంట్లతో కూడిన చిట్టాను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే నమోదైన ఏసీబీ కేసులు సహా బాధితుల నుంచి అందుతున్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తోంది.
వీటితో పాటు వార్తాపత్రికల్లో ప్రచురితమవుతున్న న్యూస్ ఆధారంగా ఆయా శాఖలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ, అంతర్గతంగా విచారణ జరుపుతూ నివేదికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్స్‌లో సోదాలు జరపడంతో పాటు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన రిపోర్టులను ప్రభుత్వానికి అందించింది. పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది.
ఆ మూడు డిపార్ట్‌మెంట్ల పైనే విజిలెన్స్ గురి
రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఆర్టీఏ శాఖలపై గత కొంతకాలంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కు అనేక ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు అత్యంత రహస్యంగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. డిపార్ట్‌మెంట్ల వారీగా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నారు. స్థానిక అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా వివరాలు సేకరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై నిఘా పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల గురించి అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించిన పలు ప్రభుత్వ శాఖల రిపోర్టులను ఇటీవల ప్రభుత్వానికి అందించారు.
