ఎల్బీనగర్, వెలుగు: ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ నేతృత్వంలో కంటోన్మెంట్ ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి164.88 కిలోల గంజాయి, ఒక కారును, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన నబిన్ సబర్ (28), సుధాకర్ మండల్ (27) డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. బర్మాపూర్ డ్రగ్ వ్యాపారితో మహారాష్ట్ర, కర్నాటకకు గంజాయి తరలించేందుకు ఒక్కో లోడుకు రూ. 60 వేల ఒప్పందం చేసుకున్నారు.
గతంలో రెండుసార్లు విజయవంతంగా రవాణా చేసిన వీరు.. ఆదివారం మధ్యాహ్నం కారులో 80 ప్యాకెట్లలో గంజాయిని ప్యాక్ చేసి, ఔటర్ ఎగ్జిట్ 11 వద్ద ఇతరులకు అప్పగించేందుకు వేచి చూస్తుండగా పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. నిందితుల్లో నబిన్ సబర్ గతంలోనూ గంజాయి కేసులో జైలుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
