61 వేల 125 ఎకరాల్లో నేచురల్ ఫామింగ్... ఈ యాసంగి నుంచే సాగు మొదలుపెట్టిన వ్యవసాయ శాఖ

61 వేల 125 ఎకరాల్లో నేచురల్ ఫామింగ్... ఈ యాసంగి నుంచే సాగు మొదలుపెట్టిన వ్యవసాయ శాఖ
  • రాష్ట్రంలోని 489 క్లస్టర్లలో 61,125 ఎకరాల్లో పంటలు
  • ప్రతి క్లస్టర్​కు క్రిషీ సఖీ, మూడు క్లస్టర్లకు బయో రిసోర్స్ సెంటర్​​
  • తోడ్పాటు అందిస్తున్న సెంటర్​ ఆఫ్ ​నేచురల్ ​ఫామింగ్​
  • సఖీ, బీఆర్​సీలకు ట్రైనింగ్..  61,125 మంది రైతులకు శిక్షణ
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక సాయం

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో నేచురల్​ఫామింగ్​ను ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ శిక్షణ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మిషన్ ఆన్ స్కీమ్​ను ఈ యాసంగి సీజన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 61,125 ఎకరాల్లో అమలు చేయనుంది. ఒక్క క్లస్టర్‌‌‌‌లో 125 మంది రైతులను ఎంపిక చేసి ఒక్కో రైతు ఎకరం భూమి సాగు చేసేలా 125 ఎకరాల్లో సహజ సాగును ప్రోత్సహించనుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 489 క్లస్టర్లలో  61,125 మంది రైతులతో సాగు చేపట్టనుంది. ఈ పథకం కింద రైతులకు రెండేండ్లపాటు ఎకరానికి సంవత్సరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. 

ప్రత్యేక శిక్షణ, సమన్వయకర్తల నియామకం 

అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన వారిని ప్రతి క్లస్టర్​కు ఇద్దరు క్రిషీ సఖీ(కమ్యూనిటీ రిసోర్స్​పర్సన్)లను రాష్ట్ర వ్యాప్తంగా 978 మందిని నియమించారు. ప్రతి మూడు క్లస్టర్లకు రెండు బీఆర్ సీ(బయో ఇన్​పుట్​రిసోర్స్ సెంటర్లు) చొప్పున మొత్తం 326 ఏర్పాటు చేశారు. ద్రావణాలు, కషాయాల తయారీలో వీరికి ట్రైనింగ్​ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో నేచురల్​ఫామింగ్​ఇనిస్టిట్యూషన్​లను ఏర్పాటు చేసి ఇద్దరు సైంటిస్టులు, ఒక మాస్టర్​ట్రైనర్​ను భాగస్వామ్యం చేశారు. 

వీటిల్లో15 ఎన్జీవోలు, 8 క్రిషీ విజ్ఞాన కేంద్రాలు(కేవీకే), రెండు హార్టికల్చర్​ఇనిస్టిట్యూషన్​లను ఇన్వాల్వ్ చేశారు. వీరందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్​ఆఫ్​నేచురల్​ఫార్మింగ్(సీఓఎన్ఎఫ్) ట్రైనింగ్​ఇచ్చింది. 489 క్లస్టర్లలోని రైతులకు వీరు నాచురల్​ఫామింగ్​పై అవగాహన కల్పిస్తున్నారు. సహజ సాగు విధానాలు, మార్కెటింగ్, ఆదాయం పెంపుపై శిక్షణ ఇస్తున్నారు. ఇలా ఏడాదికి కనీసం మూడు సార్లు శిక్షణ ఇవ్వనున్నారు.

లింకేజీ ద్వారా ఉత్పత్తుల మార్కెటింగ్

ఈ స్కీమ్​లో భాగంగా రసాయన ఎరువులు, పురుగు మందులను పూర్తిగా నివారించి.. బయోఫర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్​తో పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. రైతులు సొంతంగా తయారు చేసుకునేలా శిక్షణ ఇచ్చి ఆ రసాయనాలను బీఆర్​సీల ద్వారా మార్కెట్​లోకి అందుబాటులోకి తేనున్నారు. 

పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు, గోదాంలు, కోల్డ్ స్టోరేజీలు, హార్వెస్టింగ్ నష్టాలను తగ్గించేందుకు రైతులకు అధునాతన సాంకేతిక సాయం అందించనున్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి తమ ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండ్‌‌‌‌ తో మార్కెట్​చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తున్నారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయం

ఈ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు అందిస్తున్నాయి. రసాయన రహిత సాగును నిర్ధారించేందుకు పంటల నమూనాలను సేకరించి ల్యాబ్‌‌‌‌లలో పరీక్షిస్తారు. మూడేండ్లపాటు వరుసగా సహజ సాగు చేసిన రైతులకు ఈ స్కీమ్​లో పూర్తిస్థాయి గుర్తింపు లభిస్తుంది. 

ఈ పథకం కింది ఇప్పటికే రూ.21కోట్ల నిధులు మంజూరు కాగా, ఈ యాసంగి కోసం ఎకరానికి రూ.2 వేల చొప్పున ఇప్పటికే ఆర్థికసాయం అందించారు. ఈ స్కీమ్​తో రాష్ట్రంలో సహజ వ్యవసాయం విస్తరించడంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నరు.