Home Bound: ఆస్కార్ రేసులో భారత్ సత్తా.. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన 'హోమ్ బౌండ్'!

Home Bound: ఆస్కార్ రేసులో భారత్ సత్తా.. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన 'హోమ్ బౌండ్'!

భారతీయ సినిమా ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమోగుతోంది. 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్-2026)లో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరపున అధికారిక ఎంట్రీగా వెళ్లిన 'హోమ్ బౌండ్' (Home Bound) అద్భుతమైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది చిత్రాలతో పోటీపడింది. అకాడమీ లేటెస్ట్ గా ప్రకటించిన 15 చిత్రాల షార్ట్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది.

కథాంశం.. 

నీరజ్ మైదాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, సమాజంలోని లోతైన సమస్యలను ప్రతిబింబిస్తుంది. యంగ్ టాలెంటెడ్ హీరో ఇషాన్ ఖట్టర్, పవర్‌ఫుల్ పెర్ఫార్మర్ విశాల్ జెత్వా,  విలక్షణ నటనతో ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.  పోలీసు అధికారులు కావాలనే బలమైన ఆకాంక్ష ఉన్న ఇద్దరు స్నేహితుల ప్రయాణం ఇది. అయితే, వారి లక్ష్యానికి అడ్డుగా నిలిచే కుల, మత వివక్షలను వారు ఎలా ఎదుర్కొన్నారు? వ్యవస్థలో పాతుకుపోయిన అసమానతలను ధిక్కరించి తమ కలను ఎలా నిజం చేసుకున్నారు? అనే అంశాలను దర్శకుడు ఎంతో హృద్యంగా తెరకెక్కించారు.

కరణ్ జోహార్ ఆనందం..

ఈ చిత్రం షార్ట్ లిస్ట్ అవ్వడంపై చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. "ఇది భారతీయ సినిమాకు గర్వకారణమైన క్షణం" అంటూ ఆయన పేర్కొన్నారు. జనవరి 22, 2026న షార్ట్ లిస్ట్ చేసిన 15 చిత్రాల నుంచి తుది 5 చిత్రాల నామినేషన్లను ప్రకటిస్తారు. మార్చి 15, 2026న లాస్ ఏంజిల్స్‌లో జరిగే ప్రధాన వేడుకలో విజేతను ప్రకటిస్తారు.

గతంలో 'ఆర్ఆర్ఆర్' (RRR) చిత్రంలోని 'నాటు నాటు' పాట ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'హోమ్ బౌండ్' కంటెంట్ పరంగా ఎంతో బలంగా ఉండటంతో, ఈసారి భారత్‌కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' విభాగంలో ఆస్కార్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు ఆస్కార్ వేదికపై ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. మరి 'హోమ్ బౌండ్' ఆ చివరి ఐదింటిలో నిలిచి, భారత్‌కు ఆస్కార్‌ను తెస్తుందో లేదో చూడాలి.