IND vs SA: మ్యాచ్‌కు ముందు బిగ్ ట్విస్ట్: నాలుగో టీ20 నుంచి గిల్ ఔట్.. శాంసన్‌కు ఛాన్స్

IND vs SA: మ్యాచ్‌కు ముందు బిగ్ ట్విస్ట్: నాలుగో టీ20 నుంచి గిల్ ఔట్.. శాంసన్‌కు ఛాన్స్

సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ దూరమయ్యాడు. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు గిల్ కు పాదానికి గాయమైంది. దీంతో నాలుగో టీ20 మ్యాచ్ కు ఈ టీమిండియా వైస్ కెప్టెన్ అందుబాటులో ఉండడం లేదు. గిల్ స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి రావడం ఖాయమైంది. ఫామ్ లో లేని గిల్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో టీమిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. గిల్ గాయంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

టీ20 వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న శుభ్‌‌‌‌‌‌‌‌మన్ గిల్ ఫామ్ ఇండియాను కలవరపెడుతోంది. ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌‌‌‌‌‌‌‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు. 

గిల్ చివరి 15 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(0), 28(28) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 28 పరుగులు చేసినా 28 బంతులు తీసుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపించాయి. ఇలాంటి సమయంలో గిల్ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి. 

పొగ మంచు కారణంగా టాస్ ఆలస్యం:
 
ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన నాలుగో టీ20 ఆలస్యం కానుంది. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ లో అనుకున్న సమయానికి టాస్ పడలేదు. భారత కాలమాన ప్రకారం 6:30 గంటలకు టాస్ వేయాలి. 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్టేడియంలో దట్టమైన పొగ మంచు కారణంగా టాస్ ఆలస్యంగా వేయనున్నారు. దీంతో 7:30 గంటలకు టాస్ వేయనున్నారని సమాచారం. స్టేడియంలో ఉన్న పొగ మంచు ఎదురుగా ఉన్న స్టాండ్‌లలో ఉన్న ప్రేక్షకులు ఎవరూ కనిపించడం లేదని అక్కడ ఉన్న కామెంట్రీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు.