హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్‌లో డిసెంబర్ 14, 2025న హనుక్కా వేడుకల సమయంలో జరిగిన కాల్పుల్లో 15 మంది మృతి చెందిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన ఇద్దరిలో ఒకరు మృతి చెందిన సాజిద్ అక్రమ్ కాగా, మరొకరు అతని కొడుకు నవీద్ అక్రమ్ అని తెలిసిందే. అయితే.. దాడి చేసిన ఇద్దరిలో ఒకరైన సాజిద్ అక్రమ్ కు హైదరాబాద్ సిటీ మూలాలు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ విషయాన్ని స్వయంగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాజిద్ అక్రమ్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు చెందినవాడు.1998లో ఉద్యోగావకాశాల కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకాం పూర్తి చేసి, యూరోపియన్ మూలాలున్న వెనేరా గ్రోసోను వివాహం చేసుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు.
నవీద్ అక్రమ్, అతని సోదరి ఆస్ట్రేలియాలో జన్మించి, ఆస్ట్రేలియన్ పౌరులుగా పౌరసత్వం తీసుకున్నారు. సాజిద్ అక్రమ్ దగ్గర భారత పాస్‌పోర్ట్ ఉంది. గత 27 ఏళ్లుగా సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్‌లోని కుటుంబంతో పరిమిత సంబంధాలే ఉన్నాయని బంధువులు తెలిపారు. సాజిద్ అక్రమ్, అతని కుమారుడి రాడికలైజేషన్‌కు భారత్ లేదా తెలంగాణతో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమిక అంచనాలో తేలింది. సాజిద్ అక్రమ్ భారత్‌లో ఉన్న సమయంలో అతనిపై ఎలాంటి నేర రికార్డు లేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తూ, ధృవీకరించని సమాచారంపై ఊహాగానాలు చేయవద్దని మీడియాను, ప్రజలను కోరారు. వీళ్లు ISIS సిద్ధాంతాల ప్రభావంతో ఈ దాడికి పాల్పడ్డారని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. దర్యాప్తు కొనసాగుతోంది.
బోండీ బీచ్‌లో ఏం జరిగింది..?
న్యూసౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఎనిమిది రోజుల యూదుల పండుగ ‘హనుక్కా’ ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. ఇందుకోసం వందలాది మంది గుమిగూడారు. ఈ సమయంలోనే దుండగులు కాల్పులు మొదలుపెట్టారు.
పిల్లలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా ఫైరింగ్ చేశారు. బుల్లెట్ గాయాలతో కొందరు రక్తం మడుగులో పడిపోగా.. మరికొందరు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో మొత్తం 15 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
