న్యూఢిల్లీ: టీమిండియా టాలెంటెడ్ ప్లేయర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది. వేలంలో మొదట పృథ్వీ షా అమ్ముడుపోలేదు. అతడిని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజ్ ఆసక్తి చూపించకపోవడంతో అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. చివర్లో మరోసారి వేలంలోకి వచ్చినప్పటికీ అతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కనీసం ముందుకు రాలేదు. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనీస ధరకు దక్కించుకుంది. గత సీజన్లో పృథ్వీ షా అన్ సోల్డ్‌గా మిగిలిన విషయం తెలిసిందే.
ఆరేండ్ల కిందట అండర్19 వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్‌గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్లో సచిన్ టెండూల్కర్‌తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ షా కెరీర్‌పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యింది. ఇందుకు ప్రధాన కారణం అతడి వైఖరే. అధిక బరువు, గాయాలు, ఫామ్ కోల్పోవడం, వ్యక్తిగత విభేదాలు ఇవ్వన్నీ పృథ్వీ కెరీర్‌ను పక్కదారి పట్టించాయి. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌డమ్ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. చివరకు జ్ఞానోదయం కావడంతో మళ్లీ కెరీర్‌పై ఫోకస్ పెట్టాడు.
తనకు ప్రధాన సమస్య అయిన అధిక బరువుపై ఫోకస్ పెట్టి భారీగా వెయిట్ లాస్ అయ్యాడు. ఇండియా టీములో స్థానం కోసం దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇటీవల జరిగిన రంజీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. అయినప్పటికీ వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించకపోవడం గమనార్హం. కానీ చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనీస ధరకు కొనుగోలు చేసి తనను తాను నిరూపించుకోవడానికి మరో అవకాశం కల్పించింది.
