చిన్నారి కల నెరవేర్చిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

చిన్నారి కల నెరవేర్చిన సీపీ స్టీఫెన్ రవీంద్ర

సనత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో లైబ్రరీ ఏర్పాటైంది. ఓ చిన్నారి బాలిక చేసిన విజ్ఞప్తికి స్పందించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. పోలీస్ స్టేషన్ లోగ్రంథాయలం ఏర్పాటు చేశారు. అంతే కాదు విజ్ఞప్తి చేసిన చిన్నారితోనే లైబ్రరీని ఓపెన్ చేయించారు. ఈ లైబ్రరీ అందరికీ అందుబాటులో ఉంటుందని సీపీ స్టీఫెన్ రవీంద్ర ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇది చాలా మంది జీవితాలను మలుపు తిప్పడంలో సహాయపడుతుందని ఆకాంక్షించారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీతో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు ఓ లెటర్ అందింది. బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల చిన్నారి ఆకర్షణ సతీష్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరింది. గతంలో అంటే 2021 జులైలో ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్‌లో లైబ్రరీని ప్రారంభించే అవకాశం తనకు దక్కిందని తెలిపింది. అదే తరహాలో సనత్‌నగర్‌ పీఎస్‌లోనూ లైబ్రరీ ఉండాలని కాంక్షిస్తున్నట్టు పేర్కొంది.

ఈ లేఖపై స్పందించిన సీపీ స్టీఫెన్ రవీంద్ర.. తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలు అని, పీఎస్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరిన ఆకర్షణ సతీష్‌ను అభినందించారు. పీఎస్‌లోకి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన వారు కూడా ఈ లైబ్రరీ సేవలను ఉపయోగించుకుంటారని ఆ విద్యార్థిని తెలిపినట్టు పేర్కొన్నారు.