హాలియా, వెలుగు : అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని నల్గొండ టాస్క్‌ఫోర్స్, పెద్దవూర పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను పెద్దవూర ఎస్సై వీరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. సివిల్ సప్లై విభాగంలో సరుకుల పంపిణీ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న కందుల వెంకటరమణ, పెద్దవూర మండలం తెప్పలమడుగు శివారులోని అమ్మ రైస్ మిల్ ఓనర్ మలిగిరెడ్డి రామానుజరెడ్డి, సివిల్ సప్లై స్టేజ్ టు కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్న బూరుగు శ్రీనివాస్, కుక్కడం రమేశ్, నల్గొండలోని ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్‌లో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌గా పనిచేస్తున్న లింగాల మల్లేశ్, శ్రీకాంత్ కలిసి రేషన్ బియ్యం దందాను చేస్తున్నారు.
రేషన్ బియ్యాన్ని ఎంఎల్‌ఎస్ పాయింట్లకు తరలిస్తున్నట్లు నకిలీ పేపర్స్ సృష్టించి ఎడ్ల ఆంజనేయులుకు చెందిన లారీలో తెప్పలమడుకు వద్ద గల రామానుజన్‌రెడ్డి చెందిన అమ్మ రైస్ మిల్‌కు తరలిస్తున్నారు. ఇలా ఈ నెల 15న ఒక లోడ్‌ను, 16న రెండు లోడ్లను నల్గొండలోని ఎస్‌డబ్ల్యూసీ గోడౌన్ నుంచి డైరెక్ట్‌గా రైస్‌మిల్‌కు తరలించారు. బియ్యాన్ని అక్కడ డంప్ చేసి వేరే బ్యాగులో ప్యాక్ చేసి తిరిగి ప్రభుత్వానికే అమ్మేందుకు ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా ఈ నెల 16న ఎడ్ల ఆంజనేయులు, మిల్లు అకౌంటెంట్ వెంపటి సంతోష్ కుమార్, క్యాషియర్ లింగంపల్లి సైదులు కలిసి బియ్యాన్ని అన్‌లోడ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్, పెద్దవూర పోలీసులు రైస్ మిల్‌పై దాడి చేసి 550 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. లింగాల మల్లేశ్, వెంపటి సంతోష్‌కుమార్, సైదులు, ఎడ్ల ఆంజనేయులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మిలిగిన వారు పరారీలో ఉన్నారని పెద్దవూర ఎస్సై వీరబాబు తెలిపారు.
అలాగే అక్రమంగా తరలిస్తున్న మరో 199 బస్తాల రేషన్ బియ్యాన్ని హాలియా సమీపంలో పట్టుకున్నారు. మొత్తం 749 బస్తాలతో పాటు కొంత విడి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై ఆఫీసర్లకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
