బిల్డర్లను బ్లాక్​మెయిల్​ చేస్తే క్రిమినల్ కేసులు : మంత్రి తలసాని

బిల్డర్లను బ్లాక్​మెయిల్​ చేస్తే క్రిమినల్ కేసులు : మంత్రి తలసాని

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​లో భవన నిర్మాణదారులను బ్లాక్ మెయిల్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. అలాంటి వారిని ప్రోత్సహించొద్దని టౌన్​ప్లానింగ్ అధికారులపై సీరియస్ అయ్యారు. అలాంటి వారితో సన్నిహితంగా మెలిగితే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల గోషామహాల్ లోని చాక్నవాడిలో కుంగిన నాలా ప్రాంతాన్ని గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొందరి బ్లాక్ మెయిల్ ఫిర్యాదులతో బిల్డర్లు వ్యాపారం చేయలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బెదిరింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. వసూళ్లకు పాల్పడే వారు తమ పార్టీకి చెందినవారైనా సరే ఉపేక్షించబోమన్నారు. చాక్నవాడిలో నాలా కోసం రూ.1.27 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పనులు ప్రారంభించి.. 45 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.