సర్కార్​కు స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ క్లారిటీ

సర్కార్​కు స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యంతో రైతులకు క్రాప్ లోన్లు అందడం లేదు. ప్రభుత్వం నుంచి పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల నిధులు కూడా రిలీజ్ కావడం లేదు. రెండేండ్లుగా ధరణి పోర్టల్ సమస్యను పరిష్కరించకపోవడంతో రైతులకు క్రాప్ లోన్ల మంజూరులో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. రానున్న స్టీరింగ్ మీటింగ్ లో ఈ రెండింటిపై క్లారిటీ ఇవ్వకపోతే క్షేత్రస్థాయిలో రైతులకు క్రాప్ లోన్లు ఇవ్వడం కష్టమేనని స్టేట్ లెవల్ బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తేల్చి చెప్పింది.  2014 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బ్యాంకులకు పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల నిధులు రూ.725.18 కోట్లు రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరం బకాయిలకు సంబంధించి ఒక్క పైసా రిలీజ్ చేయలేదు. ఫలితంగా రైతులకు క్రాప్ లోన్లు మంజూరు చేయడంలో సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వానికి ఎస్ఎల్బీసీ వివరించింది. ఇప్పటికే చాలా చోట్ల రైతుల నుంచి వడ్డీలు కట్టించుకుని లోన్లు రెన్యువల్ చేస్తూ వచ్చామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ బకాయిలు ఇవ్వకపోతే.. అంతా రైతుల మీదే భారం వేయాల్సి వస్తుందని, రైతులు లోన్లు చెల్లించలేని పరిస్థితి వస్తే క్రాప్ లోన్లు ఇయ్యడమే ఆగిపోతుందని స్పష్టం చేసింది. 

కేంద్రం ఇస్తున్నా రాష్ట్ర సర్కార్ నిధులు ఇస్తలే

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లక్ష్యాన్ని మించి క్రాప్ లోన్లు మంజూరు కాలేదు. ఈ వానాకాలం సీజన్లో రూ.40,718 కోట్లు టార్గెట్ ఉంటే ఇప్పటి వరకు ఇచ్చింది రూ.30,520 కోట్లు మాత్రమేనని ఆఫీసర్లు తెలిపారు. కొత్తగా సాంక్షన్ చేసిన క్రాప్ లోన్లు 15 శాతం లోపేనని ఎస్ఎల్బీసీ అధికారులు చెప్తున్నారు. పంట రుణాలు రెండు రకాలున్నాయి. ఇందులో లక్ష లోపు తీసుకుంటే ఏడు శాతం వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీంట్లో కేంద్రం ఆర్బీఐ నుంచి 3 శాతం వడ్డీ చెల్లిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం చెల్లిస్తుంది. దీంతో రూ.ఒక లక్ష క్రాప్ లోన్ తీసుకున్న రైతు.. ఏడాదిలోపు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తే వడ్డీ మాఫీ వర్తిస్తుంది. ఇలా లక్షల మంది రైతులు ఏడాదిలోపు తమ పంట రుణాలను ఎప్పటికప్పుడు రెన్యువల్ చేసుకుంటున్నారు. ఇక రూ.లక్ష  నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటే రైతులు పావలా వడ్డీ మాత్రమే కట్టాల్సి ఉంటుంది. అందులో ఒక శాతం రాష్ట్రం, మూడు శాతం కేంద్రం, మరో మూడు శాతం రైతులు భరించాలి. కేంద్రం నిధులు వస్తున్నా, రాష్ట్ర సర్కారు నిధులు విడుదల చేస్తలేదు. 2021–22 బడ్జెట్ లోనూ వడ్డీలకు కేటాయింపులు చూపించకపోవడతో రైతుల నుంచే వసూలు చేయాల్సి వస్తున్నదని అధికారులు తెలిపారు.

ధరణితో టెక్నికల్ ఇష్యూ

ధరణి వెబ్ పోర్టల్ సమస్యల్లో క్రాప్ లోన్ల అంశం ఒకటి. సాధారణంగా క్రాప్ లోన్ కానీ వేరే ఇతర లోన్లు కానీ ఇవ్వాలంటే బ్యాంకులు కచ్చితంగా ఏదో ఒకటి తనఖా పెట్టుకునే ఇస్తయి. అయితే తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ యాక్ట్ –2020  ప్రకారం పాస్ బుక్ లు  తనఖా పెట్టకూడదు. ధరణి ఆధారంగా క్రాప్ లోన్లు ఇవ్వాలి. అందులోనే ఏ పాసు పుస్తకం నంబర్, ఏ సర్వే నంబర్ పై ఎంత విస్తీర్ణానికి క్రాప్ లోన్ తీసుకుంటున్నారనే వివరాలను బ్యాంకర్లు చూసుకుని ఇవ్వాలి. అయితే ఆ వివరాలను ధరణిలో ప్రభుత్వం కరెక్టుగా అందుబాటులోఉంచలేదు. బ్యాంకుల్లో లోన్ లు ఉన్నాయో లేదో చూడకుండానే కుటుంబ సభ్యుల పేర్లమీద కొంతమంది సబ్ సర్వే నంబర్లతో మ్యుటేషన్లు చేసుకున్నరు. పాత పాస్ బుక్కుల్లో లోన్లు తీసుకున్నట్లు చూపించే రికార్డు ఉండేదని, ధరణి పోర్టల్లోనూ అలాంటి రికార్డు పెట్టాలని గతంలోనే ఎస్ఎల్బీసీ సూచించింది. అయితే ఈ టెక్నికల్ సమస్యలను  పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు.