దళిత బంధు పాతదే: సీఈసీకి కరీంనగర్  జిల్లా కలెక్టర్ రిపోర్ట్

దళిత బంధు పాతదే: సీఈసీకి కరీంనగర్  జిల్లా కలెక్టర్ రిపోర్ట్
  • ఈనెల 4న వాసాలమర్రిలో ప్రారంభమైంది..
  • సీఈసీకి కరీంనగర్  జిల్లా కలెక్టర్ రిపోర్ట్
  • ప్రభుత్వం బడ్జెట్​లో రూ.వెయ్యి కోట్లు కేటాయించినట్లు వెల్లడి

హైదరాబాద్, వెలుగు: దళిత బంధు పథకం పాతదేనని కేంద్ర ఎలక్షన్ కమిషన్​కు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్‌‌వీ కర్ణన్ రిపోర్టు ఇచ్చారు. ఇది కొత్త స్కీం కాదని, మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించిందని వివరించారు. దళిత బంధు స్కీమ్ ఈనెల 4న యాదాద్రి జిల్లా వాసాలమర్రి గ్రామంలో ప్రారంభమైందని ఈసీకి పంపిన రిపోర్టులో ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కీమ్ అమలవుతుందని వెల్లడించారు. ఈ మేరకు గత నెల 18న రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుపై జీవో నంబర్ 6 ఇచ్చామని తెలిపారు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు కింద స్కీం అమలు చేయడం అనేది రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. 

ఓటర్లను ప్రభావితం చేసేలా దళిత బంధు స్కీం ఉందని, హుజూరాబాద్​లో బై ఎలక్షన్స్ ముగిసే వరకు అక్కడ అమలు చేయకుండా చూడాలని సీఈసీకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. హుజూరాబాద్​లో దళిత బంధు స్కీం అమలుపై ఆరా తీసింది. నివేదికను అందించాలని రాష్ట్ర సీఈఓను ఈ నెల 3న అడిగింది. ఆ మరుసటి రోజే సీఎం కేసీఆర్.. వాసాలమర్రిలో పర్యటించి, తదుపరి రోజు నుంచే దళిత బంధు పథకాన్ని గ్రామంలోని దళితుల కుటుంబాలకు వర్తింపజేస్తున్నట్లు ప్రకటించారు. ఐదో తేదీనే రూ.7.6 కోట్లు రిలీజ్ చేశారు. ఈసీ ఆదేశాల ప్రకారం ఈ నెల 5వ తేదీ లోపే ఫ్యాక్ట్ రిపోర్ట్ పంపించాల్సి ఉండగా, ఐదు రోజులు ఆలస్యంగా10వ తేదీన నివేదికను రాష్ట్ర సీఈఓకు కరీంనగర్ కలెక్టర్ పంపారు. సీఈవో నుంచి సీఈసీకి ఈ రిపోర్టు చేరనుంది.
ఎలక్షన్స్​కు రెడీ
హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఈసీ ఎప్పుడైనా షెడ్యూల్ ప్రకటించే చాన్స్ ఉంది. దేశంలో కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పడు రిపోర్ట్​లు తెప్పించుకుంటున్న ఈసీ.. స్థానిక పరిస్థితులను బట్టి ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీంతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశాలతో కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేసింది. ఈవీఎంల ఏర్పాటు, ఆర్​వో (రిటర్నింగ్ ఆఫీసర్లు), ఏఆర్​ఓలను నియమించింది. ఈవీఎంలకు ఈ నెల 17  కల్లా ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి చేయనుంది.

వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు
త్వరలో బై ఎలక్షన్స్ జరగనున్న హుజూరాబాద్ లో రెండు నెలలుగా రాష్ట్ర సర్కార్ రూ.వందల కోట్లను ఖర్చు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ చేసిన కంప్లయింట్​పై కూడా ఈసీకి రిపోర్ట్ అందింది. హుజూరాబాద్​లో రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తమ దృష్టికి రాలేదని తన లెటర్​లో జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అవన్నీ నిరాధార ఆరోపణలని, నిజం కాదని, అలా జరుగుతున్నట్లు జిల్లా అధికారులకు తెలియదని తెలిపారు. వీటిపై పిటిషనర్ ఎలాంటి ఆధారాలను చూపలేదని చెప్పారు.